టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్‌లకు ఐసీసీ షాకిచ్చింది. భారత్-ఆసీస్ మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్‌లో వీరిద్దరూ పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఐసీసీ వీరిద్దరి మ్యాచ్ ఫీజుల్లో 20 శాతం కోత విధించింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కూడా లభించింది. గత 24 నెలల్లో చేసిన మొదటి తప్పిదం కావడంతో సిరాజ్, హెడ్ నిషేధం బారి నుంచి తప్పించుకున్నారు. వీరిద్దరు తాము చేసిన తప్పిదాలను ఒప్పుకుని మ్యాచ్ రిఫరీ విధించిన పెనాల్టీని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో సిరాజ్, హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని జోష్ మీద ఉన్న హెడ్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హెడ్.. సిరాజ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.
ఇందుకు ప్రతిగా సిరాజ్ కూడా నోటికి పని చెప్పాడు. సిరాజ్ ఒక అడుగు ముందుకేసి హెడ్‌ను పెవిలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగలు చేశాడు. ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. సిరాజ్, హెడ్ మ్యాచ్ ఫీజ్‌ల్లో 20 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ సాంక్షన్ చేసింది.
ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్‌లో సిరాజ్, బుమ్రా పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో పేక మేడలా కూలింది.
నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు మినహా బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. అంతకుముందు తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment