
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కొత్త చైర్మన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. శ్రీలంక క్రికెట్ (SLC) అధిపతి షమ్మీ సిల్వా స్థానంలో నఖ్వీ నియమితులయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన సంస్థ ఖండాంతర సభ్యుల ఆన్‌లైన్ సమావేశం ద్వారా ACC నాయకత్వ మార్పు నిర్ధారించబడింది. నఖ్వీ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. చైర్మన్ మార్పుకు సంబంధించి ACC నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సమావేశానికి హాజరైన పలువురు సభ్యులు నఖ్వీ ఎన్నికైన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను నిర్వహించడం నఖ్వీ ముందున్న ప్రథమ పరీక్ష. వాస్తవానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు ఉండటం చేత టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం ఆసియా కప్ మీడియా హక్కులను విక్రయించే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్‌ను నిర్వహించే తటస్థ దేశం ఏది అనేది నఖ్వీ నిర్ణయించాల్సి ఉంటుంది. టోర్నీ నిర్వహణ రేసులో యూఏఈ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. శ్రీలంక కూడా పోటీలో ఉంది.