మరో హిస్టరీ ముంగిట ధోని | MS Dhoni To Become Most Capped Player In The History Of IPL | Sakshi
Sakshi News home page

మరో హిస్టరీ ముంగిట ధోని

Published Fri, Oct 2 2020 4:02 PM | Last Updated on Fri, Oct 2 2020 10:55 PM

MS Dhoni To Become Most Capped Player In The History Of IPL - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలవడం ద్వారా సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కొత్త రికార్డును లిఖించిన సంగతి తెలిసిందే. ఒక ఫ్రాంచైజీ తరఫున వంద విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు ధోని ముంగిట మరో రికార్డు నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోని సాధించనున్నాడు. ఈరోజు(శుక్రవారం) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌ ధోనికి 194వ ఐపీఎల్‌ మ్యాచ్‌. దాంతో ఇప్పటివరకూ సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా రికార్డును ధోని బ్రేక్‌ చేయనున్నాడు. (చదవండి: కింగ్స్‌ పంజాబ్‌ ఓటమికి కారణాలు ఇవే..)

ఈ రికార్డు ఇప్పటివరకూ రైనా పేరిట ఉండగా దాన్ని ధోని సవరించనున్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌కు రైనా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లినా అక్కడి నుంచి ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దాంతో రైనా తన రికార్డును కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఆ క్రమంలోనే అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌ల రికార్డుకు ధోని వచ్చేశాడు.

అయితే ఈ టోర్నీ ముగిసేవరకూ ధోని ఈ రికార్డును కొనసాగించాలంటే మాత్రం సీఎస్‌కే కనీసం ప్లేఆఫ్స్‌కు చేరాల్సి ఉంది. ధోని తర్వాత స్థానంలో రోహిత్‌ శర్మ ఉన్నాడు. రోహిత్‌ 192 ఐపీఎల్‌ మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా ముంబై ప్లేఆఫ్స్‌కు చేరితే ధోని రికార్డు ఈ సీజన్‌లోనే తెరమరుగవుతుంది. ఆ రికార్డునే రోహిత్‌ బ్రేక్‌ చేస్తాడు. కింగ్స్‌ పంజాబ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఫలితంగా విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనాల తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఇక ధోని 4,476 ఐపీఎల్‌ పరుగులతో ఉ‍న్నాడు. 4,500 పరుగుల మార్కును చేరడానికి 24 పరుగుల దూరంలో ఉన్నాడు.

రైనా సరసన ధోని..
ఇక క సీఎస్‌కే తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రైనా సరసన ధోని నిలవనున్నాడు. నేటి మ్యాచ్‌తో సీఎస్‌కే తరఫున 164  మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. అంతకుముందు సీఎస్‌కే తరఫున రైనా  164 మ్యాచ్‌లు ఆడాడు. సీఎస్‌కే తరఫున ఇదే అత్యధిక మ్యాచ్‌లు వ్యక్తిగత రికార్డు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement