MS Dhoni's Daughter Ziva Annual School Fees Will Shock You - Sakshi
Sakshi News home page

Ziva Dhoni: ధోని గారాలపట్టి జివా స్కూల్‌ ఫీజు తెలిస్తే షాక్‌! అయినా తక్కువే అంటున్న ఫ్యాన్స్‌!

Published Sat, Aug 5 2023 10:24 AM | Last Updated on Sat, Aug 5 2023 11:04 AM

MS Dhoni Daughter Ziva Annual School Fees Will Shock You - Sakshi

MS Dhoni's Daughter Ziva: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో కుతూహలం ఉండటం సహజం. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలతో పాటు.. పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆరా తీయడం షరా మామూలే. ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫ్యాన్స్‌కు ఈ పని మరింత ఈజీ అయిపోయింది.

సరిలేరు నీకెవ్వరు!
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్‌ క్రీడా జీవితం తెరిచిన పుస్తకమే. అదే విధంగా.. ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోని.. క్రికెటర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కీర్తి ప్రతిష్టలతో పాటు లెక్కకు మిక్కిలి డబ్బు కూడా సంపాదించాడు. కెరీర్‌లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్న మహేంద్రుడు.. 2010, జూలై 4న సాక్షి సింగ్‌ను పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు.

గారాలపట్టి జివా
అన్యోన్య దంపతులుగా పేరున్న ఈ జంటకు 2015, ఫిబ్రవరి 6న కూతురు జివా జన్మించింది. పాప పుట్టే సమయానికి ధోని.. వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌తో ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే బిడ్డను చూడటానికి దేశానికి తిరిగి వచ్చాడు.

ఇక ఒక్కగానొక్క కూతురు జివా అంటే ధోనికి పంచప్రాణాలు. కాస్త విరామం దొరికినా తన గారాలపట్టి కోసమే సమయం కేటాయిస్తాడు తలా. కోటీశ్వరుడైన ధోని తలచుకుంటే తన కూతురిని విదేశాల్లో టాప్‌ మోస్ట్‌ స్కూల్స్‌లో చదివించగలడు. కానీ.. బిడ్డకు దూరంగా ఉండటం అతడికి ఇష్టం లేదు.

రాంచిలోనే.. ఫీజు ఎన్ని లక్షలంటే!
అందుకే స్వస్థలం రాంచిలోనే పేరెన్నికగన్న ప్రముఖ పాఠశాలలో జివాను చేర్పించారు ధోని దంపతులు. ఎనిమిదేళ్ల జివా ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నట్లు సమాచారం. మరి.. ఇంటర్నేషనల్‌ స్కూళ్లో డే స్కాలర్‌గా ఉన్న జివా కోసం ధోని ఏడాదికి చెల్లిస్తున్న ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రెండు లక్షల డెబ్బై ఐదువేల రూపాయలు!!

తామే స్వయంగా..
సదరు పాఠశాల వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం గ్రేడ్‌ 2-8 వరకు డే స్కాలర్స్‌కు రూ. 2,75,000, హాస్టల్‌లో ఉండే వాళ్లకు రూ. 4,40,000 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కన జివా నెల ఫీజు సుమారు 23 వేల రూపాయలు! దాదాపు వెయ్యి కోట్ల మేర ఆర్జించిన తలాకు ఈ మొత్తం లెక్కకాదు. అయితే, కూతుర్ని విదేశాల్లో చదివించడమో.. హాస్టల్లో వేయడమో కాకుండా తామే స్వయంగా బిడ్డ ఆలనాపాలనా దగ్గరుండి చూసుకోవడం విశేషమే!! 

విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌లో..
కాగా ధోనికి రాంచిలో విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ధోని తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. ఇక తలా కూతురిగా జివాకు ఉన్న  అభిమానగణం కూడా ఎక్కువే! ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.3 మిలియన్‌ ఫాలోవర్లు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక తల్లి సాక్షితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ తండ్రిని ఉత్సాహపరిచే ఈ చిన్నారి ‘చీర్‌ లీడర్‌’కు సంబంధించిన స్కూల్‌ ఫీజు అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

చదవండి: అరంగేట్రంలో 4 రన్స్‌! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement