MS Dhoni's 42nd Birthday: 42 Amazing Rare Interesting Facts On Mahendra Singh Dhoni 42nd Birthday - Sakshi
Sakshi News home page

#HappyBirthdayMSDhoni: ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు..

Published Fri, Jul 7 2023 9:38 AM | Last Updated on Fri, Jul 7 2023 7:21 PM

MS Dhoni Turns 42: Know 42 Amazing Rare Facts On His Birthday - Sakshi

#HappyBirthdayMSDhoni: మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుత ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ- 2013 సాధించి చరిత్ర సృష్టించాడు. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గూడు కట్టుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ధోని.. ఫ్రాంఛైజీ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలపడం ఇందుకు నిదర్శనం. హెలికాప్టర్‌ షాట్ల ధోని క్రీజులోకి వస్తున్నాడంటే చాలు మైదానం హోరెత్తిపోవాల్సిందే. ధోని మేనియాతో జనం ఊగిపోవాల్సిందే.

అలాంటిది ధోని పుట్టినరోజు(1981, జూలై 7) అంటే సంబరాలు అంబరాన్నంటుతాయి కదా! అవును.. ఈరోజు తలా..  42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా జార్ఖండ్‌ డైనమైట్‌​ ధోని వ్యక్తిగత జీవితం, క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించిన 42 ఆసక్తికర విషయాలు మీకోసం..

క్రికెటర్‌ అవడానికి ముందు
1. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కెరీర్‌ ఆరంభించడానికి ముందు ధోని భారత రైల్వేస్‌లో ఉద్యోగి.
2. భారత్‌లోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన ఖరగ్‌పూర్‌ పరిధిలో ట్రెయిన్‌ టికెట్‌ ఎగ్జామినర్‌గా విధులు నిర్వర్తించాడు.
3. క్రికెట్‌ కాకుండా ధోనికి ఇష్టమైన ఇతర క్రీడలు డబ్ల్యుడబ్ల్యూఈ, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌.
4. టీమిండియాలోకి వచ్చిన తొలినాళ్లలో ధోని జులపాల జుట్టుతో కనిపించేవాడు. తన హెయిర్‌స్టైల్‌కు బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం స్ఫూర్తి అట!
5. ధోనికి హాట్‌ చాకొలెట్లంటే మహాప్రీతి.

వాళ్ల పాటలంటే చెవికోసుకుంటాడు
6. ప్రముఖ సింగర్లు కిషోర్‌ కుమార్‌, ముకేశ్‌లకు ధోని వీరాభిమాని. బాలీవుడ్‌ ఓల్డ్‌ క్లాసిక్స్‌ అంటే చెవికోసుకుంటాడు.
7. ఆటోమొబైల్స్‌ అంటే ధోనికి పిచ్చిప్రేమ. ఈ విషయం తన గ్యారేజీలో ఉన్న వింటేజ్‌ మోటార్‌ సైకిల్స్‌, సూపర్‌బైకులు చూస్తే అర్థమవుతుంది.


8. 2007లో ధోని తొలిసారి సాక్షిని కలిశాడు. 2010లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జివా సంతానం.
9. 1999-2000 సీజన్‌లో ధోని దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
10. 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4876, 10773, 1617 పరుగులు సాధించాడు.

అత్యధిక స్కోరు అదే
11. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కాకుండా ధోని ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఐపీఎల్‌ జట్టు రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌.
12. 2005లో శ్రీలంక మీద సాధించిన 183 పరుగులు(నాటౌట్‌) ధోనికి వన్డేల్లో అత్యధిక స్కోరు.
13. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు.
14. వన్డేల్లో 200 లేదంటే అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఏకైక ఆసియా కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.
15. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు.

రెండో బ్యాటర్‌గా
16. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన సారథిగా ధోని అరుదైన ఘనత.
17. వన్డేల్లో అత్యధిక స్కోరు(శ్రీలంకపై 183 పరుగులు నాటౌట్‌) సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డులకెక్కాడు.  
18. ఐపీఎల్‌లో 11 ఫైనల్‌ మ్యాచ్‌లలో ఆడిన ఏకైక క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని.
19. ఐపీఎల్‌-2023లో చెన్నైని విజేతగా నిలిపిన ధోని ఐదోసారి ట్రోఫీ గెలిచాడు. తద్వారా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
20. చెన్నైలో 2013 నాటి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద ధోని 224 పరుగులు చేశాడు. భారత కెప్టెన్లలో ఈ మేరకు అత్యధిక స్కోరు నమోదు చేసిన రెండో బ్యాటర్‌ ధోని.

ఐసీసీ టైటిళ్ల వీరుడు
21. టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్‌ కీపర్‌గా 2018లో ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు.
22. స్వదేశంలో, విదేశాల్లో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు గెలిపించిన రెండో భారత కెప్టెన్‌ ధోని.
23. వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌ ధోని.
24. ఐసీసీ టీ20, వన్డే, చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు.
25. వన్డేలో ఒకే మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన ఏకైక టీమిండియా క్రికెటర్‌.

41 ఏళ్ల తర్వాత అక్కడ విజయం
26. వన్డే క్రికెట్‌లో 100 కంటే ఎక్కువ స్టంపింగ్‌లు చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌ ధోనినే!
27. 2009లో ధోని అద్భుతమైన కెప్టెన్సీ కారణంగా న్యూజిలాండ్‌ గడ్డ మీద 41 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి విజయం నమోదు చేసింది.
28. 2009లో టీమిండియాను టెస్టు క్రికెట్‌లో వరల్డ్‌ నెంబర్‌ 1గా నిలిపాడు ధోని.
29. 2008, 2009లో ధోని ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు అందుకున్నాడు.
30. 2007లో ధోని రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు గెలుచుకున్నాడు.

అవార్డులు ఇవే
31. 79 బంతుల్లో 91 పరుగులు చేసిన ధోని అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్‌ మరోసారి వన్డే వరల్డ్‌కప్‌(2011) గెలుచుకుంది.
32. టెస్టు క్రికెట్‌లో 78 సిక్సర్లు బాదిన ధోని వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత ఈ ఫీట్‌ అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు.
33. క్రీడా రంగంలో ధోని సేవలకు గానూ భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.
34. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఒకే ఒక్క క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని.
35. ధోని జీవితం ఆధారంగా 2016లో ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ పేరిట బాలీవుడ్‌లో సినిమా వచ్చింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ధోని పాత్రలో నటించాడు. సెప్టెంబరు 30, 2016లో ఈ సినిమా విడుదలైంది.

వాళ్లంటే అభిమానం
36. 2011లో ధోని లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా దక్కించుకున్నాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో క్రికెటర్‌ ధోని.
37. డబ్ల్యుడబ్ల్యుఈకి అభిమాని అయిన ధోని ఫేవరెట్‌ రెజ్లర్లు బ్రెట్‌ ది హిట్‌మ్యాన్‌ హార్ట్‌, హల్క్‌ హోగన్‌.
38. ధోని ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఫుట్‌బాలర్‌ జినెడైన్‌ జిడానే. లియొనల్‌ మెస్సీ ఆటను కూడా ధోని ఇష్టపడతాడు.
39. ధోనికి సిగ్నేచర్‌ షాట్‌ హెలికాప్టర్‌ షాట్. దానిని అతడికి నేర్పించింది మరెవరో కాదు ధోని సహచర ఆటగాడు,బెస్ట్‌ఫ్రెండ్‌ సంతోష్‌ లాల్‌.
40. తన బర్త్‌డే జూలై 7న కాబట్టి ధోని తన జెర్సీ నంబరును సెవన్‌గా ఎంచుకున్నాడు.

41. టెస్టు క్రికెట్‌లో ద్విశతకం బాదిన ఒకే ఒక్క భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధోని.
42. క్రికెటర్‌గా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ధోని ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి చెన్నైయన్‌ ఎఫ్‌సీ సహ యజమానిగా ఉన్నాడు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌.

చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్‌ వికెట్‌ తీసి.. ఇప్పుడేమో
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్‌, నిరాశపరిచిన పృథ్వీ షా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement