సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది.. | Mumbai Beat SRH By 34 Runs | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది..

Published Sun, Oct 4 2020 7:32 PM | Last Updated on Sun, Oct 4 2020 7:44 PM

Mumbai Beat SRH By 34 Runs - Sakshi

షార్జా:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ముంబై  ఇండియన్స్‌ విధించిన లక్ష్యం 209. ఇది భారీ లక్ష్యమే కానీ చిన్న గ్రౌండ్‌లో ఈ టార్గెట్‌ ఏమాత్రం కష్టంకాదనుకున్నాం. కానీ సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది. పెద్దగా మెరుపులు లేకుండానే ముంబైకి లొంగిపోయింది. ఒక్క డేవిడ్‌ వార్నర్‌(60; 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఎవరూ హాఫ్‌ సెంచరీ మార్కును చేరలేదు. జానీ బెయిర్‌ స్టో(25), మనీష్‌ పాండే(30), అబ్దుల్‌ సామద్‌(20)లు కాసేపు మెరుపులు మెరిపించినా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడలేదు. దాంతో సన్‌రైజర్స్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, పాటిన్‌సన్‌, బుమ్రాలు తలో రెండు వికెట్లు సాధించారు. కృనాల్‌ పాండ్యా వికెట్‌ తీశాడు. సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి  174 పరుగులే చేసింది. ఇది ముంబై ఇండియన్స్‌కు మూడో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు మూడో ఓటమి.

అంతకముందు ముంబై ఇండియన్స్‌ 209 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకోవడంతో రోహిత్‌ శర్మ-డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ(6) నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్‌ ఔటయ్యాడు. ఆపై డీకాక్‌-సూర్యకుమార్‌ యాదవ్‌లు ఇన్నింగ్స్‌ నడిపించారు.  ఈ సీజన్‌లో ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న డీకాక్‌ ఎట్టకేలకు టచ్‌లోకి వచ్చాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో  67 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇది డీకాక్‌కు ఈ ఐపీఎల్‌లో తొలి హాఫ్‌ సెంచరీ. (చదవండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’)

సూర్యకుమార్‌ యాదవ్‌(27; 18 బంతుల్లో 6 ఫోర్లు ) ఫర్వాలేదనిపించాడు. డీకాక్‌- సూర్యకుమార్‌ యాదవ్‌లు 42 పరుగులు జత చేశారు. ఇక ఇషాన్‌ కిషన్‌ 23 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో  31 పరుగులు సాధించాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేయగా, పొలార్డ్‌ 13 బంతుల్లో 3 సిక్స్‌లతో అజేయంగా 25 పరుగులు చేశాడు. కృనాల్‌ పాండ్యా 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో  20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో కృనాల్‌ బ్యాట్‌ ఝుళిపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌లు  తలో రెండు వికెట్లు సాధించారు. రషీద్‌ ఖాన్‌కు వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement