చిత్తుగా ఓడిన సీఎస్‌కే.. రేసు నుంచి ఔట్‌ | Mumbai Indians Beat CSk By 10 Wickets | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన సీఎస్‌కే.. రేసు నుంచి ఔట్‌

Published Fri, Oct 23 2020 10:33 PM | Last Updated on Sat, Oct 24 2020 4:14 PM

Mumbai Indians Beat CSk By 10 Wickets - Sakshi

షార్జా: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సీఎస్‌కేను చుట్టేసిన ముంబై.. ఆపై వికెట్‌ పడకుండా కొట్టేసింది. సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్‌ కిషన్‌(68 నాటౌట్‌; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్‌(46 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు వికెట్‌ పడకుండా ఛేదించారు. వీరిద్దరూ 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ముంబైకు ఘనమైన విజయాన్ని అందించారు. ఇది ముంబైకు ఏడో విజయం కాగా, సీఎస్‌కే ఎనిమిదో ఓటమి. దాంతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది.  గత మ్యాచ్‌లో ఓటమితోనే ప్లేఆఫ్‌ రేసు నుంచి దాదాపు వైదొలిగిన  సీఎస్‌కే.. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఒక్క సామ్‌ కరాన్‌ మినహా ఎవరూ ముంబై బౌలర్లను నిలువరించలేకపోవడంతో సీఎస్‌కే తక్కువ స్కోరుకే పరిమితమైంది. సీఎస్‌కే జట్టులో ధోని(16), సామ్‌ కరాన్‌(52), శార్దూల్‌ ఠాకూర్‌(11)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఈ ముగ్గురిలో కరాన్‌ ఒక్కడే కాసేపు క్రీజ్‌లో నిలబడి ముంబై బౌలర్లను ప్రతిఘటించాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ నాలుగు వికెట్లు సాధించగా, బుమ్రా, రాహుల్‌ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కౌల్టర్‌నైల్‌కు వికెట్‌ దక్కింది. 


టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో సీఎస్‌కే బ్యాటింగ్‌కు దిగింది. సీఎస్‌కే బ్యాటింగ్‌ను రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌లు ఆరంభించారు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ ఐదో బంతికి రుతురాజ్‌ ఎల్బీగా ఔట్‌ కావడంతో సీఎస్‌కే ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై రెండో ఓవర్‌లో అంబటి రాయుడు(2)ను బుమ్రా ఔట్‌ చేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్‌ నాల్గో బంతికి డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి రాయుడు పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బంతికి జగదీశన్‌(0)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ పట్టడంతో జగదీశన్‌ డకౌట్‌ అయ్యాడు.

బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి డుప్లెసిస్‌(1) ఔటయ్యాడు. కాగా, బౌల్ట్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి జడేజా(7) సైతం పెవిలియన్‌ చేరడంతో సీఎస్‌కే పవర్‌ ప్లే ముగిసేలోపే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఫలితంగా చెత్త రికార్డును సీఎస్‌కే మూటగట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే పవర్‌ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. అయితే కాసేపు ధోని(16) ప్రతిఘటించినా ఏడో ఓవర్‌లో ఔటయ్యాడు. రాహుల్‌ చాహర్‌ వేసిన ఏడో ఓవర్‌ నాల్గో బంతికి డీకాక్‌ క్యాచ్‌ పట్టడంతో ధోని నిష్క్రమించాడు. దీపక్‌ చాహర్‌(0)ను తమ్ముడు రాహుల్‌  చాహర్‌ ఔట్‌ చేశాడు. ఆపై శార్దూల్‌ ఠాకూర్‌(11)ను కౌల్టర్‌నైల్‌ పెవిలియన్‌కు పంపాడు.  దాంతో 71 పరుగుల వద్ద సీఎస్‌కే ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. 

సీఎస్‌కే వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో సామ్‌ కరాన్‌ నిలబడ్డాడు. నిప్పులు చెరిగే బంతులతో ముంబై బౌలర్లు విజృంభించిన కరాన్‌ సొగసై ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏడో స్థానంలో వచ్చిన కరాన్‌ ఏమాత్రం బెదరకుండా ముంబైను నిలువరించాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఆకట్టుకుని 52 పరుగులు సాధించాడు. దాంతో సీఎస్‌కే తేరుకుంది. 50 పరుగులకే ఆలౌట్‌ అవుతుందని అనిపించినా కరాన్‌ ఇన్నింగ్స్‌తో వంద పరుగులు దాటింది.  అదే సమయంలో ఆలౌట్‌ నుంచి కూడా తప్పించుకుంది. కరాన్‌కు తాహీర్‌(13 నాటౌట్‌) నుంచి సహకారం లభించడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. బౌల్ట్‌ వేసిన 20 ఓవర్‌ ఆఖరి బంతికి కరాన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement