అబుదాబి: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టి20 టోర్నీలో దూసుకెళుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. లీగ్‌లో 7 మ్యాచ్‌లాడిన రోహిత్ సేన ఐదో విజయంతో ‘టాప్’లోకి వచ్చింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు.
రాణించిన ధావన్...
ఢిల్లీ ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే పృథ్వీ షా (4) పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న రహానే వచ్చీ రాగానే బౌండరీలతో ప్రతాపం చూపాడు. కానీ అతని జోరు ఎంతోసేపు నిలువలేదు. పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి క్యాపిటల్స్ స్కోరు 46/2. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ తర్వాత ధావన్, అయ్యర్ అడపాదడపా ఫోర్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. జట్టు స్కోరు 100 పరుగులను దాటాక అయ్యర్‌ను కృనాల్ ఔట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 39 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న ధావన్ ఆఖరి దాకా క్రీజులో ఉన్నా కూడా ఆశించిన వేగంగా ఆడలేకపోయాడు. బౌల్ట్ వేసిన 16వ ఓవర్లో ధావన్ ఒకటి, స్టొయినిస్ 2 ఫోర్లు కొట్టడంతో 16 పరుగులొచ్చాయి. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల ఓవర్ ఇదే. తర్వాతి ఓవర్లోనే స్టొయినిస్ రనౌట్ కావడంతో స్కోరులో జోరే కనిపించలేదు.
డికాక్, సూర్యకుమార్... ఫిఫ్టీ–ఫిఫ్టీ
లక్ష్యఛేదనకు దిగిన ముంబై మందకొడిగా ఆట ప్రారంభించింది. 3, 4, 5 తొలి మూడు ఓవర్లలో ముంబై చేసిన పరుగులింతే! చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు నాలుగో ఓవర్లో డికాక్ మెరుపులు జతచేశాడు. సీనియస్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్ 6, 4 కొట్టాడు. దీంతో మూడు ఓవర్ల పాటు 12/0 స్కోరు కాస్తా ఒక్క ఓవర్లోనే 24/0తో డబుల్ అయ్యింది. కానీ తర్వాత ఓవర్లోనే ‘హిట్‌మ్యాన్’ రోహిత్ (5)ను అక్షర్ పటేల్ అవుట్‌చేశాడు. మరోవైపు డికాక్ భారీషాట్లు బాదాడు. నోర్జే బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కుదురుగా ఆడగా... డికాక్ మాత్రం వేగం పెంచాడు. హర్షల్ పటేల్ వేసిన 9వ ఓవర్లో రెండు వరుస బౌండరీలతో డికాక్ 33 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తిచేశాడు. తర్వాత కాసేపటికే ఇతన్ని అశ్విన్ బోల్తాకొట్టించాడు. 13వ ఓవర్లో ముంబై వందకు చేరింది. స్టొయినిస్ 14వ ఓవర్లో ఇషాన్ కిషన్ 6, 4 కొట్టగా... వీటిని రబడా ఓవర్లో సూర్యకుమార్ రిపీట్ చేశాడు. 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్న సూర్యకుమార్ రబడా ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. హర్దిక్ పాండ్యా (0)తో పాటు విజయానికి చేరువలో ఇషాన్ కిషన్ అవుటైనా... కృనాల్ పాండ్యా (12 నాటౌట్), పొలార్డ్ (11) ముగించారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) కృనాల్ (బి) బౌల్ట్ 4; ధావన్ (నాటౌట్) 69; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) కృనాల్ 15; శ్రేయస్ (సి) బౌల్ట్ (బి) కృనాల్ 42; స్టొయినిస్ (రనౌట్) 13; అలెక్స్ క్యారీ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1–4, 2–24, 3–109, 4–130.
బౌలింగ్: బౌల్ట్ 4–0–36–1, ప్యాటిన్సన్ 3–0–37–0, బుమ్రా 4–0–26–0, కృనాల్ 4–0–26–2, పొలార్డ్ 1–0–10–0, చహర్ 4–0–27–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) రబడ (బి) అక్షర్ పటేల్ 5; డికాక్ (సి) పృథ్వీ షా (బి) అశ్విన్ 53; సూర్యకుమార్ (సి) శ్రేయస్ (బి) రబడ 53; ఇషాన్ కిషన్ (సి) అక్షర్ పటేల్ (బి) రబడ 28; హార్దిక్ (సి) క్యారీ (బి) స్టొయినిస్ 0; పొలార్డ్ (నాటౌట్) 11; కృనాల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–31, 2–77, 3–130, 4–130, 5–152.
బౌలింగ్: రబడ 4–0–28–2, నోర్జే 4–0–28–0, అక్షర్ పటేల్ 3–0–24–1, అశ్విన్ 4–0–35–1, హర్షల్ పటేల్ 2–0–20–1, స్టొయినిస్ 2.4–0–31–1.
ముంబై మళ్లీ మురిసె...
Published Mon, Oct 12 2020 4:47 AM | Last Updated on Mon, Oct 12 2020 4:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment