మళ్లీ ముంబైదే టైటిల్‌ | Mumbai Indians Wins IPL Title Again | Sakshi
Sakshi News home page

మళ్లీ ముంబైదే టైటిల్‌

Published Tue, Nov 10 2020 10:55 PM | Last Updated on Tue, Nov 10 2020 10:58 PM

Mumbai Indians Wins IPL Title Again - Sakshi

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు  తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ముంబై ఇండియన్స్‌  5 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను మరొకసారి ముద్దాడింది. ఇది ముంబై ఇండియన్స్‌ ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్‌ కిషన్‌( 33 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ ఆది నుంచి విరుచుకుపడి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. స్టోయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి డీకాక్‌(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రోహిత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ జత కలిశాడు. ఈ జోడి 45 పరుగులు జత చేసిన తర్వాత సూర్యకుమార్‌(19; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రనౌట్‌ అయ్యాడు. అటు తర్వాత రోహిత్‌- ఇషాన్‌ కిషన్‌లు జోడి 47 పరుగులు జత చేసింది. ముంబై స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా రోహిత్‌ మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, పొలార్డ్‌(9; 4 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. హార్దిక్‌ పాండ్యా(3) నిరాశపరిచాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది.  రిషభ్‌ పంత్‌(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(65 నాటౌట్‌; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది.  టాస్‌ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్‌-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్‌ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఆ బంతికి  స్టోయినిస్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్‌ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ డీకాక్‌ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్‌ గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు.అదే బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్‌ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్‌ ధావన్‌(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో అయ్యర్‌-పంత్‌లు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడీ వికెట్లను ఆదిలోనే కోల్పోయమనే విషయాన్ని పక్కకు పెట్టి ఫ్రీగా బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో పంత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఢిల్లీ తేరుకుంది. పంత్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి ఔటయ్యాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన 15 ఓవర్‌ చివరి బంతికి హార్దిక్‌ క్యాచ్‌ పట్టడంతో పంత్‌ ఔటయ్యాడు. అటు తర్వాత హెట్‌మెయిర్‌(5) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు. అయ్యర్‌ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్నాడు.ముంబై బౌలర్లలో బౌల్ట్‌ మూడు వికెట్లు సాధించగా  కౌల్టర్‌ నైల్‌ రెండు వికెట్లు తీశాడు. జయంత్‌ యాదవ్‌కు వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement