దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఆ బంతికి స్టోయినిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు.అదే బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్ ధావన్(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తరుణంలో అయ్యర్-పంత్‌లు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడీ వికెట్లను ఆదిలోనే కోల్పోయమనే విషయాన్ని పక్కకు పెట్టి ఫ్రీగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఢిల్లీ తేరుకుంది. పంత్ హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి ఔటయ్యాడు. కౌల్టర్ నైల్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి హార్దిక్ క్యాచ్ పట్టడంతో పంత్ ఔటయ్యాడు. అటు తర్వాత హెట్‌మెయిర్(5) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో హెట్‌మెయిర్ ఔటయ్యాడు. అయ్యర్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. దాంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు సాధించగా కౌల్టర్ నైల్ రెండు వికెట్లు తీశాడు. జయంత్ యాదవ్‌కు వికెట్ దక్కింది.
పంత్ ‘రికార్డు’ బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడిగా పంత్ గుర్తింపు పొందాడు. పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో ఐపీఎల్ ఫైనల్‌లో అర్థ శతకం సాధించగా, అంతకుముందు మనన్ వోహ్రా పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. 2014లో కింగ్స్ పంజాబ్ ఫైనల్‌కు వెళ్లిన మ్యాచ్‌లో వోహ్రా అర్థ శతకం నమోదు చేశాడు. వోహ్రా 20 ఏళ్ల 318 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆనాటి మ్యాచ్‌లో వోహ్రా 67 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment