ముంబై జబర్దస్త్‌ విజయం | Mumbai Indians Beat Rajasthan By 57 Runs | Sakshi
Sakshi News home page

ముంబై జబర్దస్త్‌ విజయం

Published Tue, Oct 6 2020 11:20 PM | Last Updated on Tue, Oct 6 2020 11:26 PM

Mumbai Indians Beat Rajasthan By 57 Runs - Sakshi

అబుదాబి: ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో జబర్దస్త్‌ విజయాన్ని సాధించింది.  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ను 18.1 ఓవర్లలో 136 ఆలౌట్‌ చేసి మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ను ఏ దశలోనూ తేరుకోనివ్వకుండా చేసి విజయకేతనం ఎగురవేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌(70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఎవరు రాణించకపోవడంతో ఘోర ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌, పాటిన్‌సన్‌లు తలో  రెండు వికెట్లు తీశారు. రాహుల్‌ చాహర్‌, పొలార్డ్‌లకు తలో వికెట్‌ లభించింది. తాజా విజయంతో ముంబై నాల్గో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌కు చేరింది.(చదవండి: ‘ఆ స్పిన్నర్‌ గురించే ఎక్కువ మాట్లాడాలి’)

ముంబై నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్‌లో రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, స్టీవ్‌ స్మిత్‌(6) తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్‌(0) డకౌట్‌ అయ్యాడు. జైస్వాల్‌, శాంసన్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేయగా, స్మిత్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దాంతో 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్తాన్‌. ఆపై బట్లర్‌ ఒక్కడే పోరాటం చేసినా ఎవరు నుంచి సరైన సహకారం లభించలేదు. చివర్లో ఆర్చర్‌(24;11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)కాసేపు మెరుపులు మెరిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(79 నాటౌట్‌ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(35; 23 బంతుల్లో  2 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను డీకాక్‌, రోహిత్‌ శర్మలు ధాటిగా ఆరంభించారు. డీకాక్‌(23;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో 46 పరుగులు వద్ద ముంబై ఇండియన్స్‌ మొదటి వికెట్‌ పడింది.  కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి డీకాక్‌ పెవిలియన్‌ చేరాడు. 

అనంతరం రోహిత్‌ శర్మతో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కాగా, జట్టు స్కోరు 88 పరుగుల వద్ద రోహిత్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ తెవాటియా క్యాచ్‌ పట్టడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆపై వెంటనే ఇషాన్‌ కిషన్‌(0) గోల్డెన్‌ డక్‌గా నిష్ర్కమించాడు. వచ్చీ రావడంతోనే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత వచ్చిన కృనాల్‌(12) పెద్దగా ఆకట్టుకోలేదు. మరొక ఎండ్‌లో సూర్యకుమార్‌ నిలకడగా ఆడటంతో పాటు హార్దిక్‌ పాండ్యా నుంచి సహకారం లభించడంతో  ముంబై తిరిగి తేరుకుంది. హార్దిక్‌ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్స్‌తో 30 పరుగులు చేసి భారీ స్కోరులో సహకరించాడు. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు సాధించగా, ఆర్చర్‌, త్యాగిలకు తలో వికెట్‌ దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement