ముంబై: బెంగళూరులో వడగండ్ల వాన కురుస్తున్న సమయంలో... వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు పరుగుల తుఫాను సృష్టించింది. దీంతో కీలకమైన మ్యాచ్‌లో కఠినమైన లక్ష్యం ఎదురైనప్పటికీ ముంబై ఇండియన్స్ ఒత్తిడికి తావివ్వకుండా ధనాధంచేసింది. హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ బృందం ఘనవిజయం సాధించింది.
మరోవైపు బెంగళూరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 83; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు.
తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలో 140 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆకాశ్ మధ్వాల్ (4/37) ఇంకా దంచేయకుండా కట్టడి చేశాడు. అనంతరం ముంబై 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (47 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ‘శత’క్కొట్టి మ్యాచ్‌ను లాగేశాడు.
201 ఉఫ్...
హైదరాబాద్‌కు భారీస్కోరు చేసిన ఆనందం తర్వాత బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (14)ను అవుట్ చేసిన సంబరమే ఆఖరు! తర్వాత ఎంత శ్రమించినా ఉరుకులు, పరుగులే తప్ప వికెట్లయితే రాలనేలేదు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్, వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్ పరుగుల తుఫాను సృష్టించారు. ముఖ్యంగా గ్రీన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో 20 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. దీంతో సగం (10) ఓవర్లు పూర్తవగానే ముంబై 114/1 స్కోరుతో గెలుపుట్రాక్‌లో పడింది.
అప్పుడు 60 బంతుల్లో 87 పరుగుల సమీకరణం ముంబై బ్యాటర్లు ఇంకాస్త యథేచ్ఛగా ఆడేలా చేసింది. 31 బంతుల్లో రోహిత్ కూడా అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికి ముంబై కెపె్టన్ వికెట్ చిక్కినా... అప్పటికే హైదరాబాద్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మయాంక్ డాగర్... రోహిత్‌ను అవుట్ చేసి 128 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యాన్ని ముగిస్తే... 47 బంతుల్లో శతకం చేసిన గ్రీన్ రెండు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వివ్రాంత్ శర్మ (సి) సబ్–రమణ్‌దీప్ (బి) ఆకాశ్ 69; మయాంక్ (సి) ఇషాన్ (బి) ఆకాశ్ 83; క్లాసెన్ (బి) ఆకాశ్ 18; ఫిలిప్స్ (సి) కార్తీకేయ (బి) జోర్డాన్ 1; మార్క్‌రమ్ (నాటౌట్) 13; బ్రూక్ (బి) ఆకాశ్ 0; శాన్‌వీర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–140, 2–174, 3–177, 4–186, 5–186. బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 3–0–36–0, గ్రీన్ 1–0–2–0, జోర్డాన్ 4–0–42–1, ఆకాశ్ మధ్వాల్ 4–0–37–4, పీయూష్ చావ్లా 4–0–39–0, కార్తీకేయ 4–0–39–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) బ్రూక్ (బి) భువనేశ్వర్ 14; రోహిత్ శర్మ (సి) నితీశ్ కుమార్ రెడ్డి (బి) మయాంక్ డాగర్ 56; గ్రీన్ (నాటౌట్) 100; సూర్యకుమార్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–20, 2–148. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–1, నితీశ్ కుమార్ రెడ్డి 3–0–35–0, మయాంక్ డాగర్ 4–0–37–1, కార్తీక్ త్యాగి 2.5–0–41–0, ఉమ్రాన్ 3–0–41–0, వివ్రాంత్ 1–0–19–0, మార్క్‌రమ్ 0.1–0–1–0.
Comments
Please login to add a commentAdd a comment