షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 11 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్య పరిస్థితుల్లో ఓటమిని ఎదుర్కోవడంతో బంగ్లాదేశ్ జట్టు నిరాశలో కూరుకుపోయింది. ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ తన స్పిన్ మాయాజాలంతో (6/26) బంగ్లాదేశ్ భరతం పట్టాడు.
ఈ ఘోర పరాభవం నుంచి కోలుకోక ముందే బంగ్లా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. వికెట్‌కీపింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ చేతి వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొసేన్, ఆ జట్టు చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ దేబశిష్ చౌదురి ధృవీకరించారు. గాయం కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు వారు వెల్లడించారు.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. ఆఖర్లో టెయిలెండర్లు వేగంగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓ దశలో (132/3) సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ బంగ్లా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఘజన్‌ఫర్ ధాటికి బంగ్లాదేశ్ చివరి 7 వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఘజన్‌ఫర్ దెబ్బకు బంగ్లాదేశ్ 143 పరుగులకు కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment