కొలంబో: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కుల్దీప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురుదృష్టవశాత్తూ కొన్నిసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో వరుణ్ చక్రవర్తితో పోలిస్తే, కుల్దీప్‌నకే టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అతడికే తన ఓటు అని ముత్తయ్య మురళీధరన్ స్పష్టం చేశాడు.
కాగా ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్‌నకు యాజమాన్యం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. స్పిన్ విభాగంలో సునిల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే ఎక్కువగా వినియోగించుకుంది. ఈ విషయంపై స్పందించిన కుల్దీప్.. ‘‘నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా?’’ అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక భారత జట్టు శ్రీలంక టూర్‌లో భాగంగా జట్టులో చోటుదక్కించుకున్న అతడు... వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్.. చివరి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా.. మొదటి టీ20లో ఆడే అవకాశం రాకపోగా.. రెండో టీ20లో 2 వికెట్లతో రాణించాడు. మూడో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీశాడు. మూడో మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు.
ఈ నేపథ్యంలో రానున్న టీ20 వరల్డ్ కప్ అంచనాల గురించి ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ... ‘‘యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. ఎవరు ఫాంలో ఉంటారు.. ఎవరు ఫాం కొనసాగిస్తారన్న అంశాలు తేలతాయి. అయితే, స్పిన్నర్ల విషయంలో నేను మాత్రం కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే వికెట్లు తీయగల బౌలర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు.
ఇక వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే... తను మంచి బౌలర్. టీమిండియా, ఐపీఎల్ జట్లకు తను బెటర్ ఆప్షన్. అయితే, అజంతా మెండిస్, సునీల్ నరైన్ అంతటి స్థాయి వరుణ్‌కు లేదనే అనుకుంటాను. తను బ్యాట్స్‌మెన్‌ను మెస్మరైజ్ చేయలేడు. ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌లో భాగంగా ముత్తయ్య మురళీధరన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment