ఆసియా కప్-2023 నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు (PC: PCB)
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: వన్డే ప్రపంచకప్-2023కి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నసీం షా ఐసీసీ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడలేకపోయిన ఈ యువ ఫాస్ట్‌బౌలర్.. మెగా ఈవెంట్ నాటికి కూడా అందుబాటులోకి రావడం కష్టమేనని పాక్ సారథి బాబర్ ఆజం సంకేతాలు ఇచ్చాడు.
ఘనంగా ఆరంభించి.. కీలక సమయంలో చేతులెత్తేసిన పాక్
కాగా నేపాల్‌పై భారీ విజయంతో ఘనంగా ఆసియా కప్-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్.. సూపర్-4లో టీమిండియా చేతిలో అంతే చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఇంటిబాట పట్టింది.
పేసర్లకు గాయాలు
కొలంబోలో లంకతో మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్ పేస్ త్రయంలో ముఖ్యమైన ఇద్దరు బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీం షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో గురువారం నాటి మ్యాచ్‌లో జమాన్ ఖాన్ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. మహ్మద్ వసీం జూనియర్ కూడా తుదిజట్టులో చోటు సంపాదించాడు.
అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకదే పైచేయి అయింది. రెండు వికెట్ల తేడాతో పాక్ మీద గెలిచి టీమిండియాతో తుదిపోరుకు లంక అర్హత సాధించింది. చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా బాబర్ ఆజం బృందం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
నసీం షా
ఆసియా కప్ గోవిందా.. ఇక ప్రపంచకప్‌నకు ముందు మరో షాక్
ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్, నసీం షా గాయాల గురించి బాబర్ ఆజం ఇచ్చిన అప్‌డేట్ పాక్ అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించిన మెన్ ఇన్ గ్రీన్.. వన్డే ప్రపంచకప్‌లో కూడా చేదు అనుభవం ఎదుర్కొంటుందా అనే భయాలు వారిని వెంటాడుతున్నాయి.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘హ్యారిస్ రవూఫ్ పరిస్థితి బాగానే ఉంది. పక్కటెముకల నొప్పితో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే, వరల్డ్‌కప్ నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది.
నసీం షా కూడా అంతే. అయితే, అతడి రికవరీకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను’’ అని బాబర్ ఆజం పేర్కొన్నాడు. అయితే.. ఐసీసీ ఈవెంట్‌కు నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నానంటూ మాట దాటవేశాడు.
గతంలో 14 నెలల పాటు ఆటకు దూరం
కాగా నసీం షా గాయం గురించి ఇంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేదు. కుడి భుజం నొప్పితో విలవిల్లాడుతున్న అతడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక 20 ఏళ్ల నసీం షాకు గాయాల బెడద కొత్తే కాదు.
గతంలో వెన్నునొప్పి కారణంగా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఏకంగా 14 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌కు వన్డేల్లో కీలక బౌలర్‌గా మారిన నసీం ఇప్పటి వరకు ఆ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో 14 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2023కి ముందు నసీం ఇలా గాయపడటం పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ.
చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023
Comments
Please login to add a commentAdd a comment