3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కనీసం ఒక్క విజయం కూడా సాధించకుండానే రిక్త హస్తాలతో ఇంటిబాట పట్టింది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన పాక్.. నిన్న జరిగిన మూడో వన్డేతో వన్డే సిరీస్‌ను సైతం 0-2 తేడాతో కోల్పోయింది.
మూడో వన్డేలో ఇంగ్లండ్ 178 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించింది.
తొలుత బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో (124 నాటౌట్) చెలరేగిన బ్రంట్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీసింది. బ్రంట్‌తో పాటు బౌచియర్ (34), డేనియెల్ వ్యాట్ (44), అలైస్ క్యాప్సీ (39 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హనీ 2, డయానా బేగ్, నిదా దార్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. సోఫీ ఎక్లెస్టోన్ 3, బ్రంట్, లారెన్ బెల్ చెరో 2, కేట్ క్రాస్, చార్లెట్ డీన్ తలో వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మునీబా అలీ (47), అలియా రియాజ్ (36), సిద్రా అమీన్ (10), అయేషా జాఫర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment