ఆఖరి ప్రయత్నంలో జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరిన భారత స్టార్ నీరజ్ చోప్రా
లుసాన్ డైమండ్ లీగ్ మీట్‌లో రెండో స్థానం
సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన
సరిగ్గా రెండు వారాల క్రితం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిశాడు. ఆరు ప్రయత్నాల్లో ఐదుసార్లు అతను ఫౌల్ అయినా ఒక్క మంచి త్రో అతనికి ‘పారిస్’లో రెండో స్థానాన్ని అందించింది.
ఇప్పుడు వేదిక మారింది. సమరం ఒలింపిక్స్ నుంచి డైమండ్ లీగ్‌కు మారింది... కానీ అగ్రస్థానంలో నిలవాలనే ఒత్తిడి అతనిలో తగ్గినట్లు కనిపించలేదు... ఫలితంగా అదే తడబాటు. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆశించిన దూరం జావెలిన్ వెళ్లలేదు... కానీ ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో నీరజ్ తన స్థాయిని ప్రదర్శించాడు. ఒక్క త్రోతో రెండో స్థానానికి దూసుకెళ్లి మీట్‌ను ముగించాడు.
లుసాన్ (స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లుసాన్ మీట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మీట్‌లో నీరజ్ జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన కాగా... మొత్తం కెరీర్ లో రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
రెండేళ్ల క్రితం స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో జావెలిన్‌ను నీరజ్ 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఈవెంట్లో 90.61 మీటర్ల దూరంతో ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) మొదటి స్థానంలో నిలవగా... జూలియన్ వెబర్ (జర్మనీ; 87.08 మీటర్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఈ మీట్‌లో పాల్గొనలేదు.
పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరంతో నీరజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతను ఒకదశలో డైమండ్ లీగ్ నుంచి తప్పుకోవాలని భావించినా... చివరకు బరిలోకి దిగాడు. ఇప్పుడు పక్షం రోజుల తేడాతో కాస్త మెరుగైన ప్రదర్శన అతడి నుంచి వచ్చింది.
తొలి నాలుగు ప్రయత్నాల్లో అతని త్రో ఒక్కటీ కనీసం 85 మీటర్లు కూడా వెళ్లలేదు. నీరజ్ వరుసగా 82.10 మీటర్లు... 83.21 మీటర్లు... 83.13 మీటర్లు... 82.34 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసరగలిగాడు. వీటి తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే ఐదో ప్రయత్నం అతడిని మూడో స్థానానికి తీసుకెళ్లింది. ఇందులో జావెలిన్ 85.58 మీటర్లు వెళ్లింది.
ఆఖరి ప్రయత్నంలో అండర్సన్ ఏకంగా 90.61 మీటర్లతో కొత్త మీట్ రికార్డు నెలకొల్పి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం నీరజ్ తన శక్తిని మొత్తం ఉపయోగించి విసిరిన ఆరో అస్త్రం ఎట్టకేలకు సానుకూల ఫలితాన్ని అందించింది. 89.49 మీటర్లతో అతనికి రెండో స్థానం దక్కింది. అయితే చాలా కాలంగా నీరజ్ ఆశిస్తున్న 90 మీటర్ల మైలురాయిని మాత్రం అతను మరోసారి అందుకోలేకపోయాడు!
ఫైనల్‌కు అర్హత సాధించినట్లేనా!
తాజా ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలవడంతో నీరజ్‌కు 7 పాయింట్లు దక్కాయి. దోహా డైమండ్ లీగ్‌లో కూడా రెండో స్థానం సాధించడం ద్వారా వచి్చన 7 పాయింట్లు కలిపి ప్రస్తుతం నీరజ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రస్తుతం వెబర్‌తో సమానంగా అతను మూడో స్థానంలో ఉన్నాడు.
అండర్సన్ (21), జాకబ్ వలెచ్ (16) తొలి రెండు స్థానాలతో ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్‌కు మొత్తం ఆరుగురు అర్హత పొందుతారు. సెపె్టంబర్ 5న జ్యూరిచ్‌లో జరిగే చివరి మీట్‌లోనూ నీరజ్ పాల్గొనబోతున్నాడు. అక్కడా రాణిస్తే అతను ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. బ్రసెల్స్‌లో సెప్టెంబర్ 14 నుంచి ఫైనల్ పోటీలు జరుగుతాయి.
ఈవెంట్ ఆరంభంలో కొంత నిరాశ కలిగింది. అయితే ఫలితం తర్వాత చూస్తే నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ముఖ్యంగా చివరి ప్రయత్నంలో నా కెరీర్‌లో రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. సరిగ్గా మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత నేను కోలుకోగలగడం, పోరాటస్ఫూర్తి కనబర్చడం ఆనందాన్నిచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాలు 80–83 మీటర్ల మధ్యే ఉన్నా ఆఖరి రెండు త్రోలలో నా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాను.
ఈ స్థాయి పోటీల్లో మానసికంగా కూడా దృఢంగా ఉండి చివరి వరకు పోరాడటం ముఖ్యం. అండర్సన్ 90 మీటర్ల త్రో విసిరాక నాపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా దానిని దాటాలని అనుకున్నా. అయితే నా మిత్రుడైన కెన్యా ప్లేయర్ జూలియస్ యెగో నా వద్దకు వచ్చి తగిన సలహా ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎక్కువ దూరం విసరగలవు అని చెబుతూ నా ఆందోళనను తగ్గించాడు. దాంతో ఒత్తిడి లేకుండా జావెలిన్‌ను విసరగలిగాను. –నీరజ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment