లుసాన్ (స్విట్జర్లాండ్): ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా తాను బరిలోకి దిగిన రెండో టోర్నీలోనూ అగ్రస్థానాన్ని సంపాదించాడు. లుసాన్‌లో జరిగిన సీజన్‌లోని ఆరో డైమండ్ లీగ్ మీట్‌లో 25 ఏళ్ల నీరజ్ టైటిల్ గెల్చుకున్నాడు. గాయం కారణంగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న నీరజ్‌కు ఈ మీట్‌లో ఐదో ప్రయత్నం ప్రదర్శన మొదటి స్థానాన్ని ఖరారు చేసింది.
ఐదో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. ‘ఫౌల్ త్రో’తో మొదలుపెట్టిన భారత స్టార్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.52 మీటర్లు... మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు. అనంతరం నాలుగో ప్రయత్నం ‘ఫౌల్’కాగా, ఆరో ప్రయత్నంలో జావెలిన్ 84.15 మీటర్ల దూరం వెళ్లింది. జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.03 మీటర్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.13 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు.
డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా మొత్తం ఏడు మీట్‌లలో జావెలిన్ త్రో ఈవెంట్ ఉంది. ఏడు మీట్‌ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు సెపె్టంబర్ 16, 17 తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. లుసాన్ మీట్‌లో టైటిల్ నెగ్గిన నీరజ్ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈనెల 21న మొనాకోలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న నీరజ్ ఆగస్టులో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాడు. లుసాన్ డైమండ్ లీగ్ మీట్‌లో లాంగ్‌జంప్ ఈవెంట్ లో పాల్గొన్న భారత అథ్లెట్ శ్రీశంకర్ 7.88 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment