నేడు పురుషుల జావెలిన్ త్రో ఫైనల్
ఫేవరెట్‌గా భారత స్టార్ నీరజ్
రాత్రి గం. 11:55 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
పారిస్: యావత్ భారతావని ఆశలు మోస్తూ... పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో అదరగొట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం ఫైనల్ బరిలో దిగనున్నాడు. వరుసగా రెండోసారి పసిడి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్‌చోప్రా.. అర్హత పోటీల్లో ఒకే ఒక్క త్రోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మంగళవారం క్వాలిఫయింగ్ ఈవెంట్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి దర్జాగా ఫైనల్ చేరాడు. పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో నీరజ్ అదే ప్రదర్శన కొనసాగించాలని చూస్తున్నాడు.
అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్), జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్) నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురవనుంది. ఈరోజు జరిగే ఫైనల్లో మొత్తం 12 మంది పతకాల కోసం పోటీ పడనున్నారు. ముందుగా జావెలిన్ త్రోయర్లకు మూడు అవకాశాలు ఇస్తారు. మూడు అవకాశాల తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్న వారు ని్రష్కమిస్తారు. ఇక మిగిలిన ఎనిమిది మందికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. మొత్తం ఆరు త్రోల తర్వాత టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు షట్లర్ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్ కాంస్యం; 2012 లండన్ రజతం), షూటర్ మనూ భాకర్ (2024 పారిస్; రెండు కాంస్యాలు) మాత్రమే విశ్వక్రీడల్లో రెండేసి పతకాలు సాధించారు. గురువారం నీరజ్ పోడియంపై నిలిస్తే ఈ జాబితాలో చేరనున్నాడు. ఇక అగ్రస్థానం దక్కించుకుంటే.. దేశం తరఫున వ్యక్తిగత విభాగంలో రెండు పసిడి పతకాలు గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్‌లాండ్; 1920, 1924), జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్‌కిల్డ్‌సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment