బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా నిర్మితమైన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. బెంగళూరు నగర శివారులో సువిశాలమైన ప్రాంగణంలో అత్యున్నత సదుపాయాలతో నిర్మించిన ఎన్‌సీఏను ఈనెల 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అదే రోజున బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా జరగనుంది. ఈ మీటింగ్ అజెండాలో కార్యదర్శి ఎన్నిక అంశం లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ కానుంది. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీ కాలం నవంబర్ నెలాఖరుదాకా ఉంది.
డిసెంబర్ 1 తర్వాతే జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో అప్పటిదాకా బోర్డు కార్యదర్శిగా ఆయన కొనసాగుతారు. దీంతో ఎన్నికపై ఇప్పుడప్పుడే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశమే లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎప్పట్లాగే బోర్డు వ్యవహారాలు, ఆదాయ–వ్యయాలు, వార్షిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని బోర్డు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment