నిజామాబాద్ స్పోర్ట్స్ : బాక్సింగ్ ప్రపంచంలో ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ కీర్తి కిరీటంగా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ (52 కేజీల విభాగం)లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. నిఖత్ జరీన్ 3–2 తేడాతో థాయ్‌లాండ్ దేశానికి చెందిన జిట్‌పోంగ్ జుటామస్‌పై గెలిచి బంగారు పతకం సాధించింది. నిఖత్ విజయంతో జిల్లా లోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ క్రీడాకారులు నిఖత్ తమకు స్ఫూర్తిగా నిలిచిందంటున్నారు. నిఖత్‌లో ఉన్న పట్టుదల, క్రమశిక్షణే ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపిందని క్రీడా ప్రముఖులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన నిఖత్ 1996 జూన్ 14న జన్మించింది. ఒకటో తరగతి నుంచి పది వరకు ఇక్కడే చదివిన నిఖత్ ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంబీఏ మొదటి సంవత్స రం చదువుతోంది.
సాధించిన విజయాలు ఇలా..
- 2011లో టర్కీలో జూనియర్ మహిళ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
- 2012లో సెర్బియాలో బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజిత పతకం
- 2013లో బల్గేరియాలో అండర్–19 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజితం
- 2014లో సెర్బియాలో 3వ నేషన్ కప్‌లో బంగారు పతకం
- 2014లో సెర్బియాలో అండర్–19 బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం
- 2015లో పంజాబ్‌లోని జలంధర్‌లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్ షిప్‌లో బంగారుపతకం, బెస్ట్ బాక్సర్ అవార్డు
- 2015లో శ్రీలంకలో జరిగిన సీనియర్ నేషనల్ టోర్నమెంట్‌లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ అవార్డు
- 2015లో అస్సాంలో జరిగిన జాతీయ సీనియర్ టోర్నమెంట్‌లో బంగారు పతకం
- 2016లో అస్సాంలో జరిగిన సౌత్ ఏషియన్ ఫెడరేషన్ టోర్నమెంట్‌లో క్యాంసం
- 2016లో కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.
- 2016లో ఉత్తరఖండ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో క్యాంసం
- 2018లో హరియానాలో సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో క్యాంసం.
- 2018లో సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం
- 2019లో బెల్లారిలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో రజితం
- 2019 ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం
- 2019లో బ్యాంకాక్‌లో అసియా బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో క్యాంసం
- 2019లో గౌహతిలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నిలో క్యాంసం
- 2019లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్‌లో రజితం
- 2019లో ఇటలీలో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
- 2019లో టోక్యోలో జరిగిన టోర్నమెంట్‌లో క్యాంసం
- 2021లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో క్యాంసం
- 2021లో హరియానాలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకంతో పాటు బెస్ట్‌బాక్సర్ అవార్డును అందుకుంది.
తండ్రితో వాకింగ్ చేస్తూ..
నిఖత్ జరీన్ తన తండ్రి జ మీల్ హైమాద్‌తో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మై దానంలోకి సరదగా ఆడుకోవడానికి 13 ఏళ్ల వయస్సులో వచ్చేది. మైదానంలో స్టేజిపై బాక్సింగ్ కోచ్ షంసమోద్దీన్ బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వడాన్ని నిఖత్ గమనించింది. బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న తీరు, ప్రాక్టీ సు చేస్తున్న క్రీడాకారులను చూసి తను కూడా బా క్సింగ్ నేర్చుకుంటానని తండ్రికి చెప్పింది. తండ్రి దెబ్బలు తగులుతాయని సర్దిచెప్పాడు. అయినా పట్టుబట్టడంతో కోచ్ షంసమోద్దీన్‌కు తన కూతు రును పరిచయం చేసి బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వాలని కోరాడు. శిక్షణ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ని ఖత్ పవర్ పంచ్‌లను విసరడం నేర్చుకుంది. రన్నింగ్‌లో రాణించాలని మొదట్లో అనుకున్న నిఖత్ బా క్సింగ్‌పై ఏర్పడిన మక్కువతోనే ఈ రోజు ప్రపంచ స్థాయిలో నిలిచి బంగారు పతకం సాధించింది.
రాష్ట్రానికే గర్వకారణం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణం. ఆమె ఘన విజయంతో తెలంగాణ, జిల్లా కీర్తి ప్రతిష్టలు మరోసారి ప్రపంచం నలుదిశలా వ్యాపించాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను అన్నివిధాలా ఆదుకుంటుంది, ప్రోత్సహిస్తోందని చెప్పడానికి జరీన్ విజయమే నిదర్శనం. ఆమెకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తా. – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
మాలాంటి క్రీడాకారులకు ఆదర్శం
బాక్సింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నిఖత్ బాక్సింగ్ ఆడుతుంటే చూసి తనలాగా పంచ్ విసరాలని శిక్షణ తీసుకున్నాను. నిఖత్ మాలాంటి క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె సాధించిన విజయం మరిచిపోలేనిది. ఈ విజయం మాకు పండుగలా మారింది.
– గీర్వాని శివసాయి, జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడాకారిణి
నిఖత్‌కు అభినందనలు..
నిఖత్‌కు బాక్సింగ్‌లో మొట్టమొదటిసారిగా శిక్షణ ఇచ్చింది నేనే అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో పట్టుదల, కృషి, తపన, సాధించాలన్న కసి ఉండడం వల్లే ఉన్నత శిఖరాలకు ఎదిగింది. నా శిక్షణలో నా కొడుకులతో పాటు నిఖత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఒక కోచ్‌గా ఇది నాకు చాలా గర్వకారణం.
– షంసమోద్దీన్, బాక్సింగ్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment