సచిన్‌, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం: డేల్‌ స్టెయిన్‌ | Not Kohli Or Sachin, Dale Steyn Names Toughest Batter He Faced In International Cricket - Sakshi
Sakshi News home page

సచిన్‌, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్‌ చేయడం కష్టం: సౌతాఫ్రికా మాజీ బౌలర్‌

Published Sat, Sep 30 2023 5:10 PM

Not Kohli Or Sachin Dale Steyn Names Toughest Batter He Faced - Sakshi

Rohit Sharma- Dale Steyn: ‘‘నా కెరీర్‌లో నాకు సవాల్‌ విసిరిన బౌలర్‌ ఎవరైనా ఉన్నారా అంటే డేల్‌ స్టెయిన్‌ మాత్రమే. తన బౌలింగ్‌లో పరుగులు సాధించడం చాలెంజింగ్‌గా ఉంటుంది. అయినప్పటికీ తన ఆట తీరును నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. 

క్లాస్‌ ప్లేయర్‌ తను. అతడి నైపుణ్యాలు అమోఘం. బంతి స్వింగ్‌ చేయడంలో తనకు తానే సాటి. గంటకు 140+ కి.మీ. వేగంతో బంతిని స్వింగ్‌ చేయగలిగిన స్పీడ్‌స్టర్లు కొంతమందే ఉంటారు. అందులో స్టెయిన్‌ ముందు వరసలో ఉంటాడు’’.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి.

రోహిత్‌ ఇలా.. అతడేమో అలా
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రొటిస్‌ మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఒకే ఒక్కసారి అవుటయ్యాడు. ఇక, మూడు ఫార్మాట్లలోనూ స్టెయిన్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ సగటు 30 కంటే తక్కువ కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో స్టెయిన్‌ బౌలింగ్‌ ఎలా ఉంటుందో.. అతడిని ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడిన విషయాన్ని రోహిత్‌ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా రోహిత్‌ను ఉద్దేశించి డేల్‌ స్టెయిన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.


రోహిత్‌ శర్మ

అతడికి బౌలింగ్‌ చేయడం కష్టం
‘అద్భుతమైన బ్యాటర్‌.. జట్టును ముందుండి నడిపించే నాయకుడు.. రోహిత్‌కు బౌలింగ్‌ చేయడం నాకెల్లప్పుడూ కష్టతరంగానే ఉండేది’’ అంటూ అంతర్జాతీయ స్థాయిలో తనకు సవాల్‌ విసిరిన మేటి బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ పేరును చెప్పాడు స్టెయిన్‌. 

ఈ క్రమంలో ఇద్దరు దిగ్గజాలు.. పరస్పర గౌరవం అంటూ హిట్‌మ్యాన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన డేల్‌ స్టెయిన్‌ ఆయా ఫార్మాట్లలో వరుసగా 439, 196, 64 వికెట్లు పడగొట్టాడు.

సూపర్‌ ఫామ్‌లో హిట్‌మ్యాన్‌
పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించే క్రమంలో 2019లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన స్టెయిన్‌ గన్‌.. 2021లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో సారథి రోహిత్‌ శర్మ మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది.

గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌లో రోహిత్‌ నాలుగు అర్ధ శతకాలు చేశాడు. అందులో వరుసగా మూడు ఫిఫ్టీలు సాధించడం విశేషం. ఆసియా కప్‌-2023లో నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంకపై హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇక రోహిత్‌ శర్మ సారథ్యంలో వన్డే ఫార్మాట్లో వరుసగా రెండోసారి టీమిండియా ఆసియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావొచ్చు: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement