రోహిత్‌, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్‌ అతడే: బాబర్‌ | Not Rohit Or Virat: Babar Azam Best Batter Pick Leaves AB De Villiers Amused | Sakshi
Sakshi News home page

రోహిత్‌, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్‌ అతడే: బాబర్‌ ఆజం

Published Mon, Jul 22 2024 12:15 PM | Last Updated on Mon, Jul 22 2024 12:37 PM

Not Rohit Or Virat: Babar Azam Best Batter Pick Leaves AB De Villiers Amused

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం కెరీర్‌ పరంగా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడి సారథ్యంలో పాక్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీల్లో దారుణంగా విఫలమైంది.

భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిన బాబర్‌ బృందం.. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం సూపర్‌-8 కూడా చేరలేదు.

కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం
ఫలితంగా బాబర్‌ మరోసారి కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో తమ ఆటగాళ్లు పూర్తిగా విఫలం కావడంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు కాస్త కఠినంగానే వ్యవహరించనుందని వార్తలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఆటగాళ్లు ఇతర దేశాల టీ20 లీగ్‌లలో ఆడకుండా పాక్‌ బోర్డు అడ్డుకట్ట వేస్తోంది. గ్లోబల్‌ టీ20 కెనడా వంటి లీగ్‌లలో ఆడాలనుకున్న బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, మహ్మద్‌ రిజ్వాన్‌లకు నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించడమే ఇందుకు నిదర్శనం.

ఫామ్‌లేమితో సతమతమైనపుడు
ఇదిలా ఉంటే.. తాను ఫామ్‌లేమితో సతమతమైనపుడు వీరి సలహాలే తీసుకుంటానంటూ బాబర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపాలు ఉన్నాయని అనిపించినపుడు.. విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌లను సంప్రదిస్తానని బాబర్‌ ఆజం పేర్కొన్నాడు.

సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడుతూ అతడు ఈ విషయం వెల్లడించాడు. అదే విధంగా.. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ పేరు చెప్పాడు.

రోహిత్‌, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్‌ అతడే: బాబర్‌
ఇక ప్రత్యర్థి జట్టులో తాను చూసిన అత్యుత్తమ బ్యాటర్‌గా బాబర్‌  ఆజం డివిలియర్స్‌ పేరు చెప్పడం విశేషం. దీంతో షాకవ్వడం ఏబీడీ వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియో లింక్‌ను ఈ సౌతాఫ్రికా లెజెండ్‌ తాజాగా షేర్‌ చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందు తాను ఈ ఇంటర్వ్యూ చేసినట్లు వెల్లడించాడు.

ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ లేదంటే విరాట్‌ కోహ్లి పేరు చెబుతాడని భావించామని.. అయితే, బాబర్‌ ఏబీడీ పేరు చెప్పడం కూడా బాగుంది’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement