అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా సెర్బియా దిగ్గజం రికార్డు
429 మ్యాచ్‌లతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన మాజీ విజేత
మెల్‌బోర్న్: తనకెంతో కలిసొచ్చిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జొకోవిచ్ అవతరించాడు. 429 మ్యాచ్‌లతో స్విట్జర్లాండ్ లెజెండ్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును 430వ మ్యాచ్‌తో జొకోవిచ్ అధిగమించాడు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–1, 6–7 (4/7), 6–3, 6–2తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన జైమీ ఫారియా (పోర్చుగల్)పై గెలుపొందాడు. 3 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు రెండో సెట్‌లో మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. 14 ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
33 విన్నర్స్ కొట్టడంతోపాటు 33 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్‌లో 26వ సీడ్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్) రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. కెరీర్‌లో 77వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్ ఇప్పటి వరకు 379 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో గెలిచాడు.
ఇది కూడా ఒక రికార్డే. 369 ‘గ్రాండ్’ విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును గత ఏడాదే జొకోవిచ్ సవరించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో జొకోవిచ్, ఫెడరర్ తర్వాత సెరెనా విలియమ్స్ (423), రాఫెల్ నాదల్ (358), వీనస్ విలియమ్స్ (356) ఉన్నారు.
జ్వెరెవ్, అల్‌కరాజ్ ముందంజ
మరోవైపు రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మూడో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
జ్వెరెవ్ 6–1, 6–4, 6–1తో మార్టినెజ్ (స్పెయిన్)పై, అల్‌కరాజ్ 6–0, 6–1, 6–4తో నిషియోకా (జపాన్)పై అలవోకగా గెలిచారు. రూడ్ 2 గంటల 44 నిమిషాల్లో 2–6, 6–3, 1–6, 4–6తో జాకుబ్ మెన్‌సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన రూడ్ ఇప్పటి వరకు ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.
బోపన్న జోడీకి షాక్
పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్నకు చుక్కెదురైంది. గత ఏడాది మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి కొత్త భాగస్వామి బారింటోస్ (కొలంబియా)తో కలిసి బరిలోకి దిగాడు.
తొలి రౌండ్‌లో 14వ సీడ్ బోపన్న–బారింటోస్ ద్వయం 5–7, 6–7 (5/7)తో పెడ్రో మార్టినెజ్–జామి మునార్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. యూకీ–ఒలివెట్టి ద్వయం 2–6, 6–7 (3/7)తో ట్రిస్టన్ స్కూల్‌కేట్–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పరాజయం పాలైంది.
కిన్‌వెన్ జెంగ్ అవుట్
మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్‌లో 36 ఏళ్ల లౌరా సిగెమండ్ (జర్మనీ) 7–6 (7/3), 6–3తో కిన్‌వెన్ జెంగ్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. సబలెంకా 6–3, 7–5తో బుజాస్ మనీరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–3, 7–5తో జోడీ బురాజ్ (బ్రిటన్)పై, పెగూలా 6–4, 6–2తో ఎలీజ్ మెర్‌టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు.
ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 1–6, 6–1, 6–3తో 20వ సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–4, 3–6, 7–6 (10/8)తో మొయూక ఉచిజిమా (జపాన్)పై, 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–1, 6–0తో తాలియా గిబ్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment