స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను కివీస్ చిత్తు చేసింది. లంకేయులు నిర్దేశించిన 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి కేవలం 26.2 ఓవర్లలోనే ఊదిపడేసింది.
కివీస్ ఓపెనర్ విల్ యంగ్(86 బంతుల్లో 90, 12 ఫోర్లు) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర(45), మార్క్ చాప్‌మన్(29 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో విక్రమసింఘే ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు.
నిప్పులు చెరిగిన హెన్రీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 43.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ తలా రెండు వికెట్లు సాధించారు.
శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(56) టాప్ స్కోరర్‌గా నిలవగా..లియాంగే(36), హసరంగా(35) పర్వాలేదన్పించారు. ఇక విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే హామిల్టన్ వేదికగా జనవరి 8న జరగనుంది. కాగా ఇప్పటికే లంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment