ప్యారిస్ ఒలింపిక్స్-2024 అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది.
ఫలితంగా జ్యోతి సెమీస్ ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.
వెనుకంజలో గోల్ఫర్లు
ప్యారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు.
అంతిమ్‌పై నిషేధం.. ఖండించిన ఐఓఏ
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అంతిమ్ తొలి రౌండ్ బౌట్‌లోనే టర్కీ రెజ్లర్ యెట్‌గిల్ జెనెప్ చేతిలో ఓడిపోయింది.
ఆ తర్వాత క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) 19 ఏళ్ల అంతిమ్‌పై కఠిన నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే అంతిమ్‌పై నిషేధం విధించినట్లు వస్తున్న వార్తలను గురువారం ఐఓఏ ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment