కీర్తిపూర్ (నేపాల్): వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 పురుషుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. ఇక్కడ జరుగుతున్న ఆసియా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి టి20 ప్రపంచకప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్ జట్టును ఓడించగా... నేపాల్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై గెలిచింది. టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించడం ఇది రెండోసారి కాగా... ఒమన్ జట్టు మూడోసారి ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది. నేపాల్ 2014లో, ఒమన్ 2016, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్నాయి.
మరో రెండు బెర్త్‌ల కోసం...
వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్–అమెరికాలలో జరిగే తొమ్మిదో టి20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికి 18 జట్లు అర్హత పొందాయి. ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా నేరుగా అర్హత సంపాదించాయి. 2022 ప్రపంచకప్ ద్వారా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు బెర్త్‌లు లభించాయి.
ర్యాంకింగ్ ఆధారంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు బెర్త్‌లు దక్కాయి. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నేపాల్, ఒమన్... యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా స్కాట్లాండ్, ఐర్లాండ్... తూర్పు ఆసియా–పసిఫిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా పాపువా న్యూగినీ... అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా కెనడా అర్హత సాధించాయి. ఈనెల 22 నుంచి 30 వరకు నమీబియాలో ఏడు దేశాల మధ్య (జింబాబ్వే, కెన్యా, నమీబియా, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా) జరిగే ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు బెర్త్‌లు ఖరారవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment