ఇటీవల భారత క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న క్లిష్ట పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం. విరాట్ కోహ్లిని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించడం దగ్గర్నుంచీ దక్షిణాఫ్రికా పర్యటనకు ఓకే చెప్పడం వరకూ అంతా గందరగోళమే!. కోహ్లి కేవలం పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే గుడ్ బై చెబుతానని టీ20 వరల్డ్‌కప్‌కు ముందు చెబితే, దాన్ని సాకుగా తీసుకుని ఏకంగా వన్డేలకు కూడా కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఇక్కడ తప్పించడం తప్పుకాదు.. తప్పించిన తీరు మాత్రం ముమ్మాటికీ తప్పే!. కేవలం గంట ముందు మాత్రమే కోహ్లికి సమాచారం ఇచ్చి తప్పించడం ఏంటనేది అభ్యంతరం. కోహ్లి కూడా ఇదే విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు.
మాకు నచ్చిందే చేస్తాం..
ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, మనోళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరిపోయారు. ఏ విషయంలోనైనా తమ నిర్ణయమే పైచేయి అనుకునే బీసీసీఐ.. సఫారీ పర్యటన విషయంలో కూడా ముందుకెళ్లిపోయింది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే ప‍్రపంచం ఎలా ఉన్నా తమ పని తాము చేసుకుపోతామన్నట్లు ఉంది. పలు దేశాలు క్రికెట్ పర్యటనలను రద్దు చేసుకుంటూ ఉంటే బీసీసీఐ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ పెద్దలే ప్రజలకు హిత బోధ చేస్తున్నా, బీసీసీఐకి అవి పెడ చెవిన పడినట్లు లేదు. దక్షిణాఫ్రికా ఫ్లైట్ ఎక్కేశారు టీమిండియా క్రికెటర్లు.
ఒమిక్రాన్ నేపథ్యంలో క్రికెటర్లు కూడా పర్యటనలకు పెద్దగా ఆసక్తి చూపించకపోయినా బీసీసీఐ ఖరారు చేసింది. కాబట్టి అయ్యో దేవుడా.. ఏంటి ఇది మాకు అనుకుంటూనే సఫారీ పర్యటనకు బయల్దేరి ఉండవచ్చు. అసలు దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఇందుకు భిన్నం కాకపోవచ్చు. బోర్డులు అంగీకారం తెలపడంతో ఇరుజట్లు ఆటగాళ్లు చేసేది లేక ఆడటానికి సిద్ధమయ్యారు. ఒకవైపు ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నా క్రికెట్ బోర్డులు ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
దక్షిణాఫ్రికానే ఒమిక్రాన్‌కు కేంద్రం
అది దక్షిణాఫ్రికా.. ఒమిక్రాన్ వేరియెంట్‌కి కేంద్రమైన ప్రాంతం. ఒమిక్రాన్ వేరియెంట్‌తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. మరి అటువంటి తరుణంలో భారత క్రికెటర్లు సఫారీ గడ్డపై అడుగుపెట్టడం ఎంతవరకు సమంజసం. ఇది డబ్బులు కోసం కక్కుర్తేనా. డబ్బు వస్తే చాలు ఏమైనా చేసేస్తారా.. ప్రాణాల్ని సైతం రిస్క్‌లో పెడతారా. దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్‌ను మరింత మోసుకురమ్మని అక్కడికి పంపుతున్నారా? ఇటువంటి పలు ప్రశ్నలకు బీసీసీఐ కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి.
ఒకవేళ మన ఆటగాళ్లకు ఒమిక్రాన్ సోకదని భావిస్తుందా?, మరి ఆ కథం ఏమిటో సదరు పెద్దలకే తెలియాలి. ఇప్పటికే భారత్‌లో ఒమిక్రాన్ కేసులు వరుసగా నమోదవుతూ ఉన్న నేపథ్యంలో మనోళ్లు ఏదో సాధించుకు వస్తాం అంటూ వెళ్లడానికి బోర్డే ప్రధాన కారణమనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎంత బయోబబుల్‌లో ఉన్నా గాలి ద్వారా చాలా స్పీడ్‌గా ఒమిక్రాన్ వస్తుందని చెబుతున్న సమయంలో ఇంత సాహసం చేయడం మన బోర్డుకే చెల్లింది. మరొక విషయం ఏమింటే మన క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించడం గతంలో చాలానే జరిగాయి.
అది మరొకసారి జరగదని(దక్షిణాఫ్రికా పర్యటనలో) చెప్పలేం. బోర్డు ఆదేశాలు, చర్యలు తీసుకోవడం తప్పితే ఏమీ ఉండదు. ఈ టూర్‌కు అంత ప్రాధాన్యత ఎందుకో సగటు క్రికెట్ అభిమానికి అర్థం కావడం లేదు. ఇప్పటివరకూ వరుసగా క్రికెట్ వినోదం చూసి ఇప్పుడిప్పుడే కాస్త సేదతీరుతున్నారు ప్రేక్షకులు. అటువంటప్పుడు ఇది అవసరమా అనే ప్రశ్నే వస్తుంది.
ఎంతైనా బీసీసీఐ కదా.. ప్రపంచ క్రికెట్ శాసిస్తున్న బోర్డు కాబట్టి ఆ మాత్రం తెగువను చూపించాలేమో. ప్రస్తుతం చూపిస్తున్న మీ సాహసం ఓకే.. ఒకవేళ ఏ ఒక్క క్రికెటర్ ఒమిక్రాన్ బారిన పడ్డా బీసీసీఐ మరిన్ని విమర్శలు చూడాల్సి రావడం ఖాయం.
దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా..
Comments
Please login to add a commentAdd a comment