వెలిగిన ఒలింపిక్ జ్యోతి
అద్భుతంగా సాగిన పారిస్ విశ్వ క్రీడల వేడుకలు
‘మీ గెలుపే మా గెలుపు... మీ ఓటమే మా ఓటమి... వచ్చే రెండు వారాల పాటు మీ భావోద్వేగాల్లో మేమూ భాగం... మేమందరం మీ వైపే’... పారిస్ క్రీడల అధ్యక్షుడు, మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణపతక విజేత టోనీ ఎస్టాన్‌గెట్ ఒలింపిక్ క్రీడల విశిష్టత గురించి ఇచ్చిన సందేశంతో ఒలింపిక్స్‌కు తెర లేచింది. శుక్రవారం భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రారంబోత్సవ కార్యక్రమాలు సుదీర్ఘ సమయం పాటు సాగాయి.
సెన్ నదిపై జరిగిన బోట్ పరేడ్‌లో అందరికంటే చివరగా ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు వచి్చనప్పుడు నదీ తీరమంతా స్థానిక అభిమానుల కేరింతలతో హోరెత్తింది.స్విమ్మర్ ఫ్లారెంట్ మనాడు, డిస్కర్ త్రోయర్ మెలినా రాబర్ట్ మికాన్ ఆ దేశపు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. అంతకుముందు గత ఒలింపిక్స్ నిర్వహించిన జపాన్, 2028 ఒలింపిక్స్ జరిగే అమెరికా జట్లు వచ్చాయి.
టెన్నిస్ స్టార్ కోకో గాఫ్, బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ యూఎస్ పతాకధారులుగా వ్యవహరించారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పతాకంతో ఒక గుర్రంపై ‘మెటల్ ఉమన్’ కూర్చొని సెన్ నదిపై దూసుకుపోగా... ఆ వెంటనే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అన్ని దేశాల జాతీయ పతాకాలతో పరేడ్ సాగింది. ఆ సమయంలో నేపథ్యంలో ఒలింపిక్ గీతాన్ని వినిపించారు.
జ్యోతి వెలిగింది...
ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ముందుగా ప్రసంగిస్తూ... ఆధునిక ఒలింపిక్ క్రీడల సృష్టికర్త అయిన పియరీ డి క్యూబర్టీన్ జన్మస్థలంలో ఈ క్రీడల నిర్వహణ తమకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ ఒలింపిక్ క్రీడలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులందరి తరఫున ఫ్రాన్స్ ఫ్లాగ్‌బేరర్లు ఫ్లారెంట్ మనాడు, మెలినా రాబర్ట్ మికాన్ ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత అసలైన మరో ఘట్టం మొదలైంది.
కార్యక్రమం ఆరంభమైన దగ్గరి నుంచి ముఖానికి ముసుగులో ఒలింపిక్ టార్చ్‌తో కనిపించిన వ్యక్తి ఎట్టకేలకు దానిని తీసుకొచ్చి ఫ్రాన్స్ ఫుట్‌బాల్ గ్రేట్ జినెదిన్ జిదాన్ చేతిలో పెట్టగా... జిదాన్ దానిని టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు అందించాడు. స్పెయిన్‌కు చెందినవాడే అయినా రోలాండ్ గారోస్‌లో 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గి ఈ మట్టితో ప్రత్యేక అనుబంధం ఉండటంతో నిర్వాహకులు నాదల్‌ను సముచితంగా గౌరవించారు. ఆ వెంటనే మెరుపులు, బాణాసంచాతో ఈఫిల్ టవర్‌పై ఐదు ఒలింపిక్స్ రింగ్స్ ప్రదర్శించడంతో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
9 ఒలింపిక్ స్వర్ణాల విజేత కార్ల్ లూయిస్, నాలుగు స్వర్ణాలు సాధించిన సెరెనా విలియమ్స్, రొమేనియా జిమ్నాస్టిక్స్ దిగ్గజం నాదియా కొమనెసి వేదికపై నాదల్‌కు జత కలిశారు. జ్యోతి ఆ తర్వాత ఫ్రెంచ్ మాజీ టెన్నిస్ ప్లేయర్, ఈ ఒలింపిక్స్ డైరెక్టర్ అమెలీ మౌరెస్మో వద్దకు వెళ్లి ఆ తర్వాత బాస్కెట్‌బాల్ స్టార్ టోనీ పార్కర్ వద్దకు చేరింది. చివరగా ఫ్రాన్స్ జూడో ప్లేయర్ టెడ్డీ రైనర్, అథ్లెట్ మేరీ జోస్ పెరెక్ టార్చ్‌ను అందుకున్నారు. ప్రస్తుత, మాజీ ఒలింపియన్లు, పారాలింపియన్లు కలిపి మొత్తం 18 మంది సమక్షంలో చివరగా రైనర్, పెరెక్ జ్యోతిని వెలిగించడంతో లాంఛనంగా పారిస్ 2024 ఆటలకు నగారా మోగింది. కార్యక్రమం సాగినంత సేపూ స్వల్పంగా చినుకులు కురిసినా... దాని వల్ల ఎలాంటి ఆటంకం కలగలేదు.
ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ«దీనంలోని ‘తహితి’లో ఒలింపిక్స్‌కు సంబంధించిన సర్ఫింగ్ పోటీలు జరుగుతాయి. ఈ దీవి పసిఫిక్ మహా సముద్రంలో ఆ్రస్టేలియాకు దగ్గరగా, ఫ్రాన్స్‌కు దాదాపు 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. పారిస్‌లో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ కూడా ఘనంగా ఉత్సవం నిర్వహించడం విశేషం.
రోదసిలో ఒలింపిక్ జ్యోతి...
ఒకవైపు పారిస్‌లో వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరోవైపు రోదసిలో కూడా ఒలింపిక్స్ సంబరం కనిపించింది. ప్రతిష్టాత్మక సంస్థ ‘నాసా’ దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లో భాగంగా ఉన్న సునీతా విలియమ్స్, మరో ఐదుగురు ఆస్ట్రోనాట్‌లు కలిసి ఒలింపిక్ క్రీడలను అనుకరించి తమ సంఘీభావాన్ని ప్రదర్శించారు. ఒక్కో క్రీడాంశాన్ని గుర్తుకు తెచ్చేలా వారంతా విన్యాసాలు చేశారు. ఒలింపిక్ జ్యోతిని పోలిన నమూనా జ్యోతిని కూడా ఒకరినుంచి మరొకరు అందుకుంటూ క్రీడల పట్ల తమ అభిమానాన్ని ప్రదర్శించారు.
పెళ్లి ఉంగరం నీటిపాలు...
ప్రారంబోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఇటలీ హైజంపర్, టోక్యో స్వర్ణపతక విజేత గియాన్‌మార్కో టాంబెరి కొద్దిసేపటి తర్వాత తీవ్ర నిరాశలో మునగాల్సి వచ్చింది. ఇటలీ ఫ్లాగ్‌బేరర్ కూడా అయిన గియాన్‌మార్కో పెళ్లి ఉంగరం సెన్ నదిలో పడిపోయింది. అయితే ఒకవైపు దీనికి తన భార్యకు క్షమాపణలు చెబుతూనే అతను రాసిన వాక్యాలు హృద్యంగా, ఆసక్తికరంగా అందరి మనసులను గెలుచుకోవడం విశేషం.
‘నా పెళ్లి ఉంగరం సెన్ నదిలో పడిపోవడం బాధాకరమే అయినా అది కోల్పోవడానికి ఇంతకంటే మంచి చోటు లభించదు. ప్రేమకు చిరునామాలాంటి నగరపు నదిలో అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నా జాతీయ పతాకాన్ని సగర్వంగా పైకి ప్రదర్శించే క్రమంలో దానిని కోల్పోయాను. ఇందులో కొంత కవిత్వం కనిపించవచ్చు గానీ... నీ ఉంగరాన్ని కూడా అందులో విసిరేస్తే అవి కలిసి ఉండిపోతాయి. పెళ్లినాటి ప్రమాణాలను మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకునే మనం మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది’ అని అతను రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment