పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలి పట్ల ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించారని.. తనకు మాత్రమే నిబంధనలు వర్తింపజేస్తూ వేటు వేశారని బోర్డు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తనను ఎంతగా అణగదొక్కాలని చూసినా ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తి మాత్రం లేదని అతడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా 2024–25 ఏడాది కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని ‘ఎ’ కేటగిరి నుంచి తొలగించి ‘బి’ కేటగిరీలో వేయడం సహా.. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది.
ఇక పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ‘బి’ కేటగిరీలోనే కొనసాగించింది. అంతేకాదు.. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది.
కొత్త కెప్టెన్ రిజ్వాన్, మాజీ సారథి బాబర్ ఆజమ్‌లు ‘ఎ’ కేటగిరీలో ఉండగా... షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాన్ మసూద్‌లకు ‘బి’ కేటగిరీలో చోటు ఇచ్చింది. ఇక ‘సి’ కేటగిరీలో 9 మంది, ‘డి’ కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు అందనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న జట్టులోనూ ఫఖర్ జమాన్‌కు చోటు దక్కలేదు. బాబర్ ఆజం విషయంలో బోర్డును నిందించడం సహా ఫిట్‌నెస్ లేమి కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ఆదివారం వెల్లడించాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఫఖర్ జమాన్ తీవ్ర నిరాశకు లోనైనట్లు అతడి సన్నిహిత వర్గాలు పాక్ మీడియాకు తెలిపాయి. ‘‘అతడు చాలా బాధపడుతున్నాడు. ఫిట్‌నెస్ టెస్టుల విషయంలో తన పట్ల వివక్ష చూపారని వాపోయాడు. క్లియరెన్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పాటించారన్నాడు. రెండు కిలోమీటర్ల పరుగు విషయంలో తనతో పాటు సరైన సమయంలో పూర్తి చేయనివాళ్లకు జట్టులో చోటిచ్చి.. తనను మాత్రం విస్మరించారని ఆవేదన చెందాడు.
అసలు తన పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని సెలక్టర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టు అనంతరం బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేసిన పీసీబీ.. రెండు, మూడో టెస్టు నుంచి వారిని తప్పించింది.
ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఫఖర్ జమాన్ స్పందిస్తూ పీసీబీ తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని బోర్డు అతడిపై కన్నెర్రజేసింది.
ఈ క్రమంలోనే అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం సహా.. ఆసీస్ టూర్‌కు దూరం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ ఫఖర్ జమాన్. ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3492 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు శతకాలు ఉన్నాయి.
చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్
Comments
Please login to add a commentAdd a comment