బాబర్‌ ఆజమ్‌.. ఇక మారవా..? | PAK vs ENG 1st Test: Babar Azam Rough Patch In Tests Continues, 654 Days And 18 Innings Since Babar Scored 50 Plus Score | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజమ్‌.. ఇక మారవా..?

Published Thu, Oct 10 2024 5:31 PM | Last Updated on Thu, Oct 10 2024 5:53 PM

PAK vs ENG 1st Test: Babar Azam Rough Patch In Tests Continues, 654 Days And 18 Innings Since Babar Scored 50 Plus Score

టెస్ట్‌ క్రికెట్‌లో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పని అయిపోయింది. బాబార్‌ గత 18 ఇన్నింగ్స్‌ల్లో (654 రోజులుగా) కనీసం ఒ‍క్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను చివరిసారిగా 2023లో ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ముల్తాన్‌ టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

ఇంగ్లండ్‌ ఆటగాళ్లు డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీ చేసిన పిచ్‌పై బాబర్‌ కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయాడు. బాబర్‌తో పాటు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పాక్‌ జట్టు మొత్తం పేకమేడలా కూలింది. ఆ జట్టు 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.

267 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌.. 29 పరుగులకు రెండు వికెట్లు.. 41 పరుగులకు మూడు వికెట్లు.. అదే స్కోర్‌ వద్ద నాలుగో వికెట్‌.. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

తొలి ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ చేసిన పాక్‌ ఆటగాళ్లు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇలా వచ్చి అలా ఔటైపోతున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కాలంటే మరో 115 ఓవర్లు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం.

పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ 0, సైమ్‌ అయూబ్‌ 25, షాన్‌ మసూద్‌ 11, బాబర్‌ ఆజమ్‌ 5, సౌద్‌ షకీల్‌ 29, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 10 పరుగులు చేసి ఔట్‌ కాగా.. అఘా సల్మాన్‌ (4), అమెర్‌ జమాల్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ తలో రెండు, క్రిస్‌ వోక్స్‌, జాక్‌ లీచ్‌ చెరో వికెట్‌ తీసి పాక్‌ పుట్టి ముంచారు. ఇంగ్లండ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ స్కోర్‌ను అధిగమించాలంటే పాక్‌ మరో 180 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.

అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. జో రూట్‌ (262), హ్యారీ బ్రూక్‌ (317) డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్‌ క్రాలే (78), బెన్‌ డకెట్‌ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో నసీం షా, సైమ్‌ అయూబ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్‌ అఫ్రిది, ఆమెర్‌ జమాల్‌, అఘా సల్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్‌ షకీల్‌ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో రెండు.. క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: T20 World Cup 2024: తండ్రి ఆకస్మిక మరణం.. స్వదేశానికి పయనమైన పాక్‌ కెప్టెన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement