ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే చివరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసంభవమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 115 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (41), అమెర్ జమాల్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడి ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..?
Comments
Please login to add a commentAdd a comment