PAK vs NZ 1st Test: Kane Williamson scored an unbeaten double century - Sakshi
Sakshi News home page

PAK vs NZ, 1st Test day 4: విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీ

Published Fri, Dec 30 2022 5:19 AM | Last Updated on Fri, Dec 30 2022 10:45 AM

PAK vs NZ, 1st Test day 4: Kane Williamson scored an unbeaten double century - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (200 నాటౌట్‌; 21 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ డబుల్‌ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో పర్యాటక జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 440/6తో గురువారం నాలుగో రోజు ఆట కొనసాగించిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 194.5 ఓవర్లలో 612/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు విలియమ్సన్, ఇష్‌ సోధి (65; 11 ఫోర్లు) ఏడో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇష్‌ అర్ధసెంచరీ సాధించాడు.

తర్వాత 595 స్కోరు వద్ద ఇష్‌ సోధి నిష్క్రమించడంతో రెండు పరుగుల వ్యవధిలో సౌతీ (0), వాగ్నెర్‌ (0) వికెట్లను కోల్పోయింది. ఎజాజ్‌ పటేల్‌ (0 నాటౌట్‌) అండతో విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకోగానే కివీస్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అబ్రార్‌ అహ్మద్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన పాకిస్తాన్‌ ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌ (17), షాన్‌ మసూద్‌ (10) నిష్క్రమించగా... ఇమామ్‌ (45 బ్యాటింగ్‌), నౌమన్‌ అలీ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరు రోజు కాగా... పాకిస్తాన్‌ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. కివీస్‌ బౌలర్లు చకచకా వికెట్లు తీయగలిగితే మ్యాచ్‌ చేతిలోకి వస్తుంది.

విలియమ్సన్‌ కెరీర్‌లో ఇది ఐదో డబుల్‌ సెంచరీ. న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక డబుల్‌ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా బ్రెండన్‌ మెకల్లమ్‌ (4) పేరిట ఉన్న రికార్డును విలియమ్సన్‌ బద్దలు కొట్టాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement