రాణించిన రిజ్వాన్, ఆమిర్
న్యూయార్క్: హమ్మయ్య... పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు చేరుకునే అవకాశాన్ని సజీవంగా నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. టాస్ నెగ్గిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తర్వాత బ్యాటింగ్ వరుసలో నవ్‌నీత్ (4), పర్గత్ (2), నికోలస్ (1), మొవ్వ శ్రేయస్ (2), రవీందర్‌పాల్ (0) పాక్ బౌలర్లకు దాసోహమయ్యారు. జాన్సన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా నిష్క్రమించిన ఆరోన్ ఒక్కడి స్కోరే 52 పరుగులుండటం విశేషం!
కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ (13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో హారిస్ రవూఫ్, మొహమ్మద్ ఆమిర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో సయిమ్ అయూబ్ (6) విఫలమవగా.... ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను మొహమ్మద్ రిజ్వాన్ (53 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరి దాకా మోశాడు.
కెప్టెన్ బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. ఫఖర్ జమన్ (4)తో జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. 52 బంతుల్లో రిజ్వాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. గెలుపు వాకిట ఫఖర్ నిష్క్రమించగా, ఉస్మాన్ ఖాన్ (2 నాటౌట్)తో కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో భారత్, అమెరికా చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పాక్ (2), కెనడా (2) మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment