టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్‌ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.
అంతేకాకుండా పాక్‌కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.
తిప్పేసిన నమాన్..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది.
నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్‌ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.
ఏడేసిన సాజిద్..
ఈ మ్యాచ్‌లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment