నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ (3-1) అనంతరం టీమిండియా ఓ భారీ మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 90కు పైగా విజయాల శాతం నమోదు చేసిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్‌లో 90కు పైగా విజయాల శాతాన్ని నమోదు చేయలేదు.
భారత్.. పాకిస్తాన్ పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టింది. షార్ట్ ఫార్మాట్‌లో ఈ ఏడాది భారత్ 92.31 విజయాల శాతం కలిగి ఉంది. 2018లో పాక్ 89.43 విజయాల శాతాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా సిరీస్‌తో కలుపుకుని ఈ ఏడాది భారత్ మొత్తం 26 టీ20లు ఆడింది. ఇందులో 24 విజయాలు నమోదు చేసింది. భారత్ ఈ ఏడాది కేవలం రెండు టీ20ల్లో మాత్రమే ఓడింది.
టీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ ఛాంపియన్‌గానూ అవతరించింది. యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ 2024లో భారత్ జగజ్జేతగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్ అనంతరం భారత్.. జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికాపై వరుస సిరీస్‌ల్లో విజేతగా నిలిచింది. సౌతాఫ్రికా సిరీస్‌లో కేవలం మూడో టీ20లో మాత్రమే ఓడిన భారత్.. 1, 2, 4 టీ20ల్లో విజేతగా నిలిచింది.
పొట్టి ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన జట్లు..
భారత్- 92.31 (2024)
పాకిస్తాన్- 89.43 (2018)
ఉగాండ- 87.88 (2023)
పపువా న్యూ గినియా- 87.5 (2019)
టాంజానియా- 80.77 (2022)
ఇదిలా ఉంటే, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో బిజీగా ఉంది. ఈ సిరీస్ కోసం భారత్ ఇదివరకే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ కోసం టీమిండియా కఠోర సాధన చేస్తుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు. హిట్‌మ్యాన్ రెండోసారి తండ్రైనందున కుటుంబంతో గడిపేందుకు భారత్‌లోనే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment