ఆట అయినా యుద్ధమైన లేక మరే ఇతర విషయమైనా భారత్ ఓడిపోవాలని దాయాది పాకిస్తాన్ కోరుకోవడం సర్వ సాధారణ విషయం. అయితే టీ20 వరల్డ్‌కప్-2022లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యావత్ పాకిస్తాన్.. భారత జట్టు గెలుపును ఆకాంక్షించడం విశేషం. గ్రూప్ దశలో భారత్ తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలని పాక్ మనసార కోరుకుంటుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలవాలని పాక్ అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.
ఎందుకంటే.. టీమిండియా సూపర్-12 గ్రూప్-2లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది 4 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా ఉండగా.. ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా (2 మ్యాచ్‌ల్లో 3 పాయింట్లు), జింబాబ్వే (2 మ్యాచ్‌ల్లో 3 పాయింట్లు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉండగా, నెదర్లాండ్స్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు) చివరి స్థానంలో ఉంది.
పాక్ సెమీస్ చేరాలంటే ఆ జట్టు ఆడబోయే తదుపరి 3 మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) గెలుపొందడమే కాకుండా.. భారత్ తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే) కూడా గెలవాల్సి ఉంటుంది. ఈ సమీకరణలతో పాటు సౌతాఫ్రికా, జింబాబ్వే ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగితే భారత్ 10 పాయింట్లతో, పాకిస్తాన్ 6 పాయింట్లతో గ్రూప్-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
ఈ సమీకరణల నేపథ్యంలో గ్రూప్-2లో జరిగే ఏ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించకూడదని, అలాగే భారత్.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లను చిత్తుగా ఓడించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్.. తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ను, రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించగా, పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో చిత్తైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment