దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో (మూడో ఎడిషన్) దాయాది పాకిస్తాన్ తొలిసారి పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పాక్ జట్టులో ఎవరెవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది.
భారత్, పాక్ సహా మొత్తం 9 దేశాల జట్లు పాల్గొనే ఈ సిరీస్‌లో ఆయా దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. ఈ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా సెప్టెంబర్‌లో జరుగనుంది. మూడు వారాల పాటు సాగే ఈ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, మఖాయ ఎన్తిని, రాస్ టేలర్, కెవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, బ్రెట్ లీ, తిలకరత్నే దిల్షన్, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలతో పాటు మాజీ అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు.
రెండు సీజన్ల పాటు భారత్‌లో విజయవంతంగా సాగిన ఈ సిరీస్‌ను నిర్వహకులు ఈసారి ఇంగ్లండ్‌లో ప్లాన్ చేయడంతో పాక్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. ఈ సిరీస్ తొలి ఎడిషన్ కోవిడ్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో జరగగా.. 2022 ఎడిషన్ నిరాటంకంగా ఒకే దశలో జరిగింది.
ఈ రెండు ఎడిషన్లలో టీమిండియానే విజేతగా నిలిచింది. రెండు ఎడిషన్ల ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్టు శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి ఎడిషన్ తొలి దశలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు ఆస్ట్రేలియా జట్టు పాల్గొనగా.. కోవిడ్ నిబంధనల కారణంగా ఆతర్వాత జరిగిన మలి దశలో ఆసీస్ జట్టు పాల్గొనలేదు. అయితే 2021లో జరిగిన మలి దశ సిరీస్‌లో ఆసీస్ స్థానంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగాయి.
అనంతరం 2022లో జరిగిన సెకెండ్ ఎడిషన్‌లో ఏకంగా 8 దేశాల జట్లు పాల్గొన్నాయి. తొలి ఎడిషన్‌లో పాల్గొన జట్లతో పాటు అదనంగా కివీస్ ఈ ఎడిషన్‌లో పాల్గొంది.
2023 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొనే జట్లు..
భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment