అట్టహాసంగా పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు
అప్పుడు నదిపై, ఇప్పుడు రోడ్డుపై మార్చ్‌పాస్ట్
పారిస్: మొన్న రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఎంత వైభవంగా ఆరంభించారో... దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌ను కూడా అంతే అట్టహాసంగా అంగరంగ వైభంగా ప్రారంభించారు. దీంతో మరోసారి పారిస్ కలలు, కళాకారులు, నృత్యరీతులు, పాప్ గీతాలతో విశ్వక్రీడల శోభకు వినూత్న ‘షో’కులద్దింది. కనుల్ని కట్టిపడేసే వేడుకలు ఆద్యంతం అలరించాయి. పలు ఆటపాటలు, కళాకారుల విన్యాసాల అనంతరం ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని ఆరు ఫ్లయిట్లు ఆకాశానికి పూసినట్లుగా చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది. ఆ వెంటే మార్చ్‌పాస్ట్ మొదలైంది.
ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పడవలపై మార్ప్‌పాస్ట్ సాగితే... పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్ పారిస్ రహదారిపై కేరింతగా రెగ్యులర్ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది. రేపటి నుంచి పోటీలు జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 4000 మందికి పైగా దివ్యాంగ అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో పోటీపడతారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఆదరించినట్లుగానే ఈ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు.
2 మిలియన్ల (20 లక్షలు)కు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడమే ఆదరణకు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ మాట్లాడుతూ మరోమారు పారిస్‌ను ప్రేక్షకుల సమూహం ముంచెత్తనుందన్నారు. మూడేళ్ల క్రితం టోక్యోలో కోవిడ్ మహమ్మారి కారణంగా పారా అథ్లెట్లంతా ఖాళీ స్టాండ్ల (ప్రేక్షకులు లేక) ముందు తమ ప్రదర్శన కనబరిచారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య పారాలింపియన్లు పోటీలను పూర్తిచేస్తారని నిర్వాహకులు చెప్పారు. గురువారం ముందుగా తైక్వాండోలో పారాలింపియన్లు పతకాల బోణీ కొట్టనున్నారు. దీంతో పాటు పోటీల తొలిరోజు టేబుల్ టెన్నిస్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment