కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది.
ఈ టోర్నీలో 21 మ్యాచ్‌లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్‌ను దాటే అవకాశం లేదు.
ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment