జైపూర్ పింక్ పాంథర్స్‌పై పట్నా పైరేట్స్ విజయం
పుణే: స్టార్ రెయిడర్ దేవాంక్ దలాల్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్ పదో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 38–28 పాయింట్ల తేడాతో మాజీ విజేత జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే దేవాంక్ తన రెయిడింగ్‌తో వరుస పాయింట్లు కొల్లగొట్టగా... అతడికి అయాన్ (6 పాయింట్లు), దీపక్ (5 పాయింట్లు), అంకిత్ (5 పాయింట్లు) సహకరించారు.
పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడాడు. తాజా సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన పట్నా పైరేట్స్ 10 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 58 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 17 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 49 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ఏడో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 34–33 పాయింట్ల తేడాతో యు ముంబాపై విజయం సాధించింది.
గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ సుంగ్రోయా చెరో 10 పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టు తరఫున అజిత్ చవాన్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment