IPL 2025: పంజాబ్‌ కింగ్స్‌కు చేదు వార్త | PBKS All Rounder Azmatullah Omarzai Arrival Delayed Due To Personal Reasons, More Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025: పంజాబ్‌ కింగ్స్‌కు చేదు వార్త

Published Tue, Mar 18 2025 9:07 AM | Last Updated on Tue, Mar 18 2025 10:23 AM

PBKS All Rounder Azmatullah Omarzai Arrival Delayed Due To Personal Reasons

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌కు చేదు వార్త వినిపించింది.  ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ (అఫ్గానిస్తాన్‌) అజ్మతుల్లా వ్యక్తిగత కారణాల చేత జట్టుతో కాస్త ఆలస్యంగా జతకట్టనున్నాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభం కానుండగా... పంజాబ్‌ కింగ్స్‌ మార్చి 25న గుజరాత్‌ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

లీగ్‌ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్‌ కింగ్స్‌... ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ హెడ్‌కోచ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

వీరిద్దరితో పాటు చహల్, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇప్పటికే ధర్మశాల చేరుకున్నారు. ‘అజ్మతుల్లా వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా భారత్‌కు రానున్నాడు. మిగిలిన విదేశీ ఆటగాళ్ల రాక ఇప్పటికే మొదలైంది’ అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి.

ప్రాక్టీస్‌లో సీఎస్‌కే జోరు
మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు జోరుగా సాధన సాగిస్తోంది. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విదేశీ ఆటగాళ్లలో ఆసీస్‌ పేసర్‌ నాథన్‌ ఎలీస్‌ మినహా తక్కిన వాళ్లంతా ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రచిన్‌ రవీంద్ర, కాన్వే ఇప్పటికే జట్టుతో చేరారు. త్వరలోనే ఎలీస్‌ రానున్నాడు’ అని పేర్కొన్నారు. ధోనీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశి్వన్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement