పాకిస్తాన్ టాపార్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్‌ను తప్పిస్తూ సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఫకర్ జమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల కారణంగానే పీసీబీ జమాన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
ఇంతకీ ఫకర్ జమాన్ ఏమన్నాడంటే.. "మన ప్రీమియర్ బ్యాటర్‌ను (బాబర్ ఆజమ్) తొలగించడం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. బోర్డు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి . 2020-23 మధ్యలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పేలవ ఫామ్‌లో ఉన్నాడు.
అయితే అప్పుడు బీసీసీఐ అతన్ని తప్పించలేదు. బాబర్ పాకిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకరు. అతనిపై ఈ తరహా చర్యలు అవసరం లేదు. మన ఆటగాళ్లను వీలైనంత వరకు కాపాడుకోవడానికి చూడాలి" అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫకర్ చేసిన ఈ ట్వీట్‌పై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ఈ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పీసీబీ ఫకర్‌ను కోరింది.
పీసీబీ-ఫకర్ జమాన్ మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌లు ఆడేందుకు ఎన్‌ఓసీ జారీ చేయడంలో బోర్డు జాప్యం చేస్తుందని ఫకర్ గతంలో ఆరోపించాడు. తాజాగా బాబర్ ఎపిసోడ్ పీసీబీకి, ఫకర్‌కు మధ్య మరింత గ్యాప్ పెంచేలా ఉంది.
కాగా, ముల్తాన్ టెస్ట్‌లో (తొలి టెస్ట్) ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో పాక్ సెలెక్టర్లు సీనియర్లైన బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలపై వేటు వేశారు. అలీం దార్, అజహర్ అలీ, ఆకిబ్ జావిద్ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment