పాకిస్తాన్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం.. మళ్లీ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం!? | PCB likely to take U-Turn on Babar Azam's captaincy | Sakshi
Sakshi News home page

#Babar Azam: పాకిస్తాన్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం.. మళ్లీ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం!?

Published Thu, Feb 8 2024 7:59 AM | Last Updated on Thu, Feb 8 2024 9:07 AM

PCB likely to take U-Turn on Babar Azams captaincy - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నూతన చైర్మెన్‌గా మొహ్సిన్ నఖ్వీ ఎంపికైన సంగతి తెలిసిందే. గత నెలలో పీసీబీ ఛీప్‌ పదవి నుంచి తప్పుకున్న జకా అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు.  అతడు మూడేళ్లపాటు  ఈ పదవిలో కొనసాగనున్నాడు. అయితే పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నఖ్వీ.. ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్‌ జట్టు పగ్గాలని తిరిగి స్టార్‌ ఆటగాడు బాబర్‌కు అప్పజెప్పాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్‌ జకా అష్రఫ్.. పాక్‌ టెస్టు కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని నియమించాడు.

అయితే కెప్టెన్సీలో మార్పులు చోటుచేసుకున్నాక పాకిస్తాన్‌ జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కొత్త కెప్టెన్‌లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలకు వెళ్లిన పాకిస్తాన్‌.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్‌ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్‌(3 టెస్టులు) అవ్వగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది.

దీంతో పాక్‌ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్‌కే అప్పజెప్పాలని నఖ్వీ ఆలోచిస్తున్నట్లు పాక్‌ క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 17 నుంచి  జరగనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌ అనంతరం పాక్‌ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ నుంచే బాబర్‌ తిరిగి పాక్‌ నాయకత్వ బాధ్యతలు చేపడతాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. బాబర్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడుతున్నాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement