లక్నో: రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపియన్.. రెజ్లర్ సుశీల్ కుమార్ కొంతకాలంగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సుశీల్ ఆచూకీ చెప్పినవారికి రూ. లక్ష బహుమతి కూడా ప్రకటించారు. కాగా తాజాగా సుశీల్ కుమార్ కారులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ టోల్‌ప్లాజా వద్ద కారులో డ్రైవర్ పక్కన ముందుసీట్లో సుశీల్ కుమార్ ఉన్నట్లు అక్కడి కెమెరాల్లో రికార్డైంది.
అయితే అతను మాస్క్ పెట్టుకోవడంతో సుశీల్ కుమార్ ..అవునా కాదా? అని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు మే 6న అక్కడి కెమెరాల్లో రికార్డు కావడం.. సాగర్ రాణా హత్య జరిగిన రెండు రోజులకు సుశీల్ కారులో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో సుశీల్ ఉన్న కారును ట్రేస్ చేసే పనిలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా సుశీల్ కుమార్‌కు ఢిల్లీ కోర్టులోనూ చుక్కెదురైంది. రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
చదవండి: రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత
Comments
Please login to add a commentAdd a comment