
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్‌పై దబంగ్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో సత్తా చాటడంతో.. ఆదివారం జరిగిన పోరులో దబంగ్ 32–21 పాయింట్లతో తలైవాస్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ జట్టు తరఫున నవీన్ కుమార్, ఆశు మలిక్ (5 పాయింట్లు) రాణించారు.
ఇక తలైవాస్ తరఫున మోయిన్ (8 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 18 రెయిడ్ పాయింట్లు, 12 ట్యాకిల్ పాయింట్లు సాధించగా... తలైవాస్ ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది.
తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లు నమోదు చేసుకుంది. 48 పాయింట్లతో ఢిల్లీ మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 15 మ్యాచ్‌ల్లో 9వ పరాజయం మూటగట్టుకున్న తలైవాస్ 33 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.
బెంగాల్ వారియర్స్‌పై పట్నా గెలుపు
మరోవైపు... హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–35 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 13 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో ఆకట్టుకోగా... వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 11 పాయింట్లతో పోరాడాడు.
ఇరు జట్లు అటు రెయిడింగ్, ఇటు ట్యాక్లింగ్‌లో సమంగా నిలిచినా... ఎక్స్‌ట్రాల రూపంలో 4 పాయింట్లు సాధించిన పైరేట్స్ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం నుంచి పుణే వేదికగా పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలుత బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment