Pooja Vastrakar's father wants daughter to deposit 1.9 cr WPL auction money in FD - Sakshi
Sakshi News home page

Pooja Vastrakar: 'నా కూతురికి డబ్బు విలువ తెలియదు'

Published Wed, Feb 15 2023 5:12 PM | Last Updated on Wed, Feb 15 2023 6:07 PM

Pooja Vastrakar Father Wants daughter Deposit Auction Money FD Account - Sakshi

టీమిండియా మహిళా క్రికెటర్‌ పూజా వస్త్రాకర్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న మహిళల టి20 వరల్డ్‌కప్‌లో బిజీగా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్‌ 4 ఓవర్లు బౌలింగ్‌ వేసి ఒక వికెట్‌ కూడా పడగొట్టింది. ఇవాళ గ్రూప్‌-బిలో భాగంగా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇటీవలే తొలిసారి జరిగిన వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) వేలంలోనూ పూజాకు మంచి ధర పలికింది. ముంబై ఇండియన్స్‌ జట్టు రూ.కోటి 90 లక్షలకు పూజాను కొనుగోలు చేసింది. 

కాగా పూజా వస్త్రాకర్‌ టి20 వరల్డ్‌కప్‌ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లడానికి ముందు తండ్రి బంధన్‌ రామ్‌కు రూ. 15 లక్షల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. కూతురు గిఫ్ట్‌ను చూసి సంతోషపడాల్సిన తండ్రి ఆశ్చర్యంగా నిరాశకు గురయ్యాడు. ''నా కూతురు అనవసరంగా డబ్బులు వృథా చేస్తుందంటూ'' బంధన్‌ రామ్‌ పేర్కొనడం ఆసక్తిని కలిగించింది. పూజా వస్త్రాకర్‌ తండ్రి బంధన్‌ రామ్‌ రిటైర్డ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బంధన్‌ రామ్‌ చాలా విషయాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే..

''పూజా వస్త్రాకర్‌ తన నాలుగేళ్ల వయస్సులోనే క్రికెట్‌ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నా కూతురు టీమిండియాకు ఆడుతుందని నేను ఊహించలేదు. కానీ పట్టుదలతో తను అనుకున్నది సాధించి ఇవాళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయం. పూజా చిన్నప్పుడు క్రికెట్‌ ఆడడానికి డబ్బులు అడిగిన ప్రతీసారి తనను సరదాగా ఎగతాళి చేసేవాడిని. చదువుకోకుండా అనవసరంగా క్రికెట్‌పై డబ్బులు ఖర్చు చేయిస్తున్నావు అంటూ కోప్పడేవాడిని. అయితే నా మాటలను సంతోషంగా స్వీకరించే పూజా ఎప్పుడు ఒక మాట అంటుండేది..'' చూడు నాన్న.. ఏదో ఒకరోజు కచ్చితంగా దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తాను''.

అయితే పూజా దగ్గర ఒక బలహీనత ఉంది.. అదే డబ్బులు వృథా చేయడం. ఈ మధ్యనే వద్దని చెప్పినా కూడా రూ. 15 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది. బిడ్డ ప్రయోజకురాలు అయ్యిందంటే నాకు సంతోషమే. కానీ ఇలా అనవసరపు ఖర్చు నాకు నచ్చదు. అందుకే డబ్ల్యూపీఎల్‌ వేలం ద్వారా వచ్చిన రూ.1.90 కోట్లను దాచుకోవడానికి ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయమని చెప్పాను. ఇలా అయినా నా కూతురు అనవసర ఖర్చు తగ్గించుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు.

ఇక టీమిండియా తరపున 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పూజా వస్త్రాకర్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. జట్టు తరపున 2 టెస్టుల్లో ఐదు వికెట్లు తీసింది. ఇక 26 వన్డేల్లో 816 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు, 44 టి20ల్లో 257 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టింది.

చదవండి: Shoaib Akhtar: అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement