షూటౌట్‌లో స్లొవేనియాపై విజయం
యూరో కప్ ఫుట్‌బాల్
ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్ టీమ్‌లలో ఒకటైన పోర్చుగల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్‌లో విజయం పోర్చుగల్ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్‌లో పోర్చుగల్ 3–0తో గెలుపొందింది.
దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‌లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్‌ను స్లొవేనియా గోల్ కీపర్ జాన్ ఆబ్లక్ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్‌లో గెలిచి పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది.
పోర్చుగల్ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్‌లిసిక్, బల్కోవెక్, వెర్బిక్ కొట్టిన షాట్‌లను పోర్చుగల్ కీపర్ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో పోర్చుగల్ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్ గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment