Slovenia
-
క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్ టీమ్‌లలో ఒకటైన పోర్చుగల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్లో విజయం పోర్చుగల్ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్లో పోర్చుగల్ 3–0తో గెలుపొందింది. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‌లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్‌ను స్లొవేనియా గోల్ కీపర్ జాన్ ఆబ్లక్ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్లో గెలిచి పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది. పోర్చుగల్ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్లిసిక్, బల్కోవెక్, వెర్బిక్ కొట్టిన షాట్లను పోర్చుగల్ కీపర్ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో పోర్చుగల్ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్ గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్ చేరింది. -
ట్విటర్ ఖాతా బ్లాక్.. మస్క్ తీరుతో అసంతృప్తి.. అధికార పార్టీ కీలక నిర్ణయం
ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ తీరుపై అసంతృప్తితో స్లొవెేనియా అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సామాజిక మాధ్యమానికి తాము దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ట్విట్టర్లో తమ పార్టీ కార్యకలాపాలు ఉండవని ప్రకటించింది. ప్రజలకు చేరువ కావడానికి ఈ వేదిక తప్పనిసరి అని తాము భావించడం లేదని చెప్పింది. స్లొవేనియాలో ప్రస్తుతం ఫ్రీడం మూమెంట్ పార్టీ(జీఎస్) అధికారంలో ఉంది. సాంకేతిక కారణాలు చూపి ఈ పార్టీ అధికారిక ఖాతాను ట్విట్టర్ మూడు వారాల పాటు బ్లాక్ చేసింది. ఆ తర్వాత కూడా తిరిగి పునరుద్ధరించలేదు. అదీ కాకుండా ట్విట్టర్లో విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలపై జోరుగా ప్రచారం జరగడం తమకు ఆందోళన కల్గిస్తోందని, ఎలాన్ మాస్క్ సీఈఓ అయ్యాక పరిస్థితి ఇంకా మారిపోయిందని పార్టీ శనివారం ప్రకటన విడుదల చేసింది. అందుకే తాము ఈ ప్లాట్‌ఫాంకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా ప్రజలకు చేరువవుతామని పేర్కొంది. మొత్తం 91 స్థానాలున్న స్లొవెేనియా పార్లమెంటులో 41 సీట్లు కైవవం చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారంలోకి వచ్చింది జీఎస్ పార్టీ. అయితే మాజీ ప్రధాని రాబర్ట్ గాలోబ్ ట్విట్టర్‌ను బాగా వినియోగించుకునేవారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారానే ప్రతిపక్షం, మీడియాపై తరచూ విమర్శలు గుప్పించేవారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తాము అధికారంలోకి వస్తే రాజకీయాల్లో మళ్లీ మర్యాదపూర్వక వాతావరణాన్ని తీసుకొస్తామని, సమన్యాయ పాలన అందిస్తామని జీఎస్ పార్టీ హామీ ఇచ్చింది. రాబర్ట్ గాలోబ్ మాత్రం వీటిని విస్మరించి ఓటమి పాలయ్యారు. చదవండి: లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు.. -
కరోనాను అంతం చేశాం: ఇటలీ సరిహద్దు దేశం
లుబియానా: కరోనాకు అగ్రదేశాలే వణుకుతుంటే చిన్నదేశాలు మాత్రం దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయి. తమ దేశాల్లో కరోనాకు చోటు చేదంటూ వైరస్ వ్యాప్తిని నివారిస్తూ కరోనాను తిప్పికొడుతున్నాయి. తాజాగా స్లొవేనియా.. తమ దేశంలో కరోనా చాప్టర్ ముగిసినట్లేనని ప్రకటించింది. ఈ మేరకు స్లొవేనియా ప్రధాన మంత్రి గురువారం జానేజ్ జంజా అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా కరోనాను సమర్థవంతంగా అరికట్టిన తొలి యూరోపియన్ దేశంగా స్లొవేనియా నిలిచింది. అయితే ఇది కరోనా వల్ల చిగురుటాకులా వణికిపోయిన ఇటలీ సరిహద్దు దేశం కావడం గమనార్హం. గత పద్నాలుగు రోజులుగా అక్కడ రోజుకు ఏడు కన్నా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. (లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!) దీంతో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ సడలింపులను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది. అందులో భాగంగా ఈ వారం ప్రారంభంలో ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవగా వచ్చేవారం నుంచి పాఠశాలలు కూడా తెరుచుకోనున్నాయి. తర్వాతి వారం నుంచి రెస్టారెంట్లు, బార్లు, తక్కువ గదులున్న హోటళ్లు తెరుచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. త్వరలోనే అన్ని రకాల షాపులు, డ్రైవింగ్ స్కూళ్లు తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి వారం రోజుల క్వారంటైన్ నిబంధనను సైతం ఎత్తివేయనుంది. అయితే కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి అవసరమయ్యే కొన్ని ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. (కరోనా వచ్చినా కంగారు పడలేదు!) -
ఫ్యాషన్ డిజైనర్ నుంచి ఫస్ట్ లేడీ
అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనర్, ఆ తర్వాత సూపర్ మోడల్. మోడలింగ్ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్లే ఆమెకు లోకం. కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్ లేడీ స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్ న్వాస్ కారు డీలర్. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్లో బ్రేక్ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్ ‘జానా’లో ‘లుక్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి. ట్రంప్‌తో డేటింగ్, పెళ్లి 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్ పుట్టాడు. ట్రంప్ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. -
భారత్ ‘బి’ను గెలిపించిన స్నేహిత్
న్యూఢిల్లీ: స్లొవేనియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు ఫిడేల్ రఫిక్ స్నేహిత్ భారత జట్టును గెలిపించాడు. భారత్ ‘ఎ’ జట్టుతో జరిగిన జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్ ఫైనల్లో అతను కీలక విజయాలతో తన టీమ్‌కు బంగారు పతకం అం దించాడు. క్యాడెట్ బాలికల కేటగిరీలో భారత జట్టు రజతం గెలిచింది. బాలుర ఫైనల్లో స్నేహిత్, పార్థ్ విర్మాని, అనుక్రమ్ జైన్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 3–2తో జీత్ చంద్ర, మానవ్ ఠక్కర్, మనుశ్ షా ఉన్న ‘ఎ’ జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ 3–2 (11–6, 7–11, 11–6, 2–11, 11–8)తో తన కన్నా మెరుగైన ర్యాంకర్ జీత్ చంద్రను కంగుతినిపించాడు. తర్వాత జరిగిన పోటీల్లో పార్థ్ 0–3 (6–11, 4–11, 9–11)తో మానవ్ ఠక్కర్ చేతిలో, అనుక్రమ్ 1–3 (11–7, 6–11, 9–11, 10–12)తో మనుశ్ షా చేతిలో పరాజయం చవిచూశారు. 1–2తో వెనుకబడిన దశలో రివర్స్ సింగిల్స్‌లో మళ్లీ స్నేహిత్ 3–2 (11–9, 8–11, 4–11, 11–8, 11–5)తో మానవ్ ఠక్కర్‌పై గెలిచాడు. నిర్ణాయక మ్యాచ్‌లో పార్థ్ 3–2 (5–11, 11–6, 11–8, 8–11, 11–6)తో జీత్ చంద్రపై గెలవడంతో విజయం ఖాయమైంది. దీంతో ‘ఎ’ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. క్యాడెట్ బాలికల ఫైనల్లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. -
ప్రపంచంలోనే తొలి డిజిటల్ సమాధి
మారిబోర్: డిజిటల్ ప్రపంచంలో సమాధి రాళ్లు కూడా డిజిటల్ స్క్రీన్లుగా మారుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ సమాధి రాయి మధ్య యూరప్ దేశమైనా స్లొవేనియాలోని రెండవ అతిపెద్ద నగరమైన మారిబోర్ శ్మశానంలో వెలిసింది. 48 అంగుళాల ఈ డిజిటల్ స్క్రీన్‌పై మరణించిన వ్యక్తి డిజిటల్ చిత్రం, ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. మున్ముందు మరణించిన వ్యక్తి జీవితానికి సంబంధించిన వీడియోలను కూడా ఈ స్క్రీన్‌పై చూడొచ్చు. ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్ సమాధి రాయితో సమాధిని ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతుందట. మొదట చూడడానికి ఇది మామూలు గ్రానైట్ సమాధి రాయిగానే కనిపిస్తుంది. దాని ముందు ఎవరైనా కొన్ని క్షణాలపాటు నిలబడితే సెన్సర్ల ద్వారా అది డిజిటల్ స్క్రీన్‌గా మారిపోతుంది. ఈ డిజిటల్ స్క్రీన్‌పై పేరు, ఊరు, ఫొటోతోపాటు మొత్తం ఫొటో ఆల్బమ్‌ను ఏర్పాటు చేయవచ్చు. వాటిని ఎవరైనా చూడవచ్చు. అవసరమైతే చనిపోయిన వ్యక్తి జీవిత విశేషాలతో రాసిన ఓ నవలను కూడా పొందుపర్చవచ్చని ఈ డిజిటల్ సమాధి రాళ్లను అమ్ముతున్న బయోఎనర్జిజా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ సమాధి రాయిని మారిబోర్ నగరంలోని పోబ్రెజ్జీ శ్మశాన వాటికలో ఏర్పాటు చేశారు. ఎవరైనా డిజిటల్ సమాధి రాయి ముందు నిలబడ్డప్పుడు మాత్రమే ఫొటో ఆల్బమ్, ఇతర వివరాలు కనిపిస్తాయని, ఎదురుగా లేనప్పుడు కేవలం మతుడి పేరు, చనిపోయిన తేదీ మాత్రమే కనిపిస్తుందని, ఇంధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టేందుకే ఈ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వివరించాయి. మున్ముందు వీడియో, ఆడియోలను ప్రదర్శించేందుకు వీలుగా దీనికి ఓ ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేస్తున్నామని చెప్పాయి. శ్మశానంతో మైకులు ఉపయోగించడం మంచిది కాదుకనుక ఇయర్ ఫోన్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపాయి. -
‘ఆల్ ఇంగ్లండ్’ టోర్నీకి సన్నాహకంగా...
యూరోప్ సర్క్యూట్లో భాగంగా మంగళవారం మొదలయ్యే జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగనున్నాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి సన్నాహకంగా అతను ఈ టోర్నీలో ఆడుతున్నాడు. తొలి రౌండ్లో స్లొవేనియా ప్లేయర్ అలెన్ రోజ్‌తో శ్రీకాంత్ తలపడతాడు. గతేడాది సెప్టెంబరులో కొరియా ఓపెన్ తర్వాత గాయపడ్డ అతను 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది సయ్యద్ మోడి టోర్నీలో సెమీస్‌లోనే నిష్క్రమించాడు. -
టూకీగా ప్రపంచ చరిత్ర 50
కొత్త ఒరవడి రెండోతరం చక్రాలు అచ్చంగా మన దేవాలయాల్లో ఊరేగింపులకు ఉపయోగించే రథాలకుండే చక్రాలవంటివి. నిలువు పట్టెలనూ, అడ్డ పట్టెలనూ పొరలు పొరలుగా అతికించి, దళసరిగా తయారైన తరువాత, వృత్తాకారంగా చెక్కిన కొయ్యచక్రం ఇది. ఈ తరహా చక్రానికి ఆనవాలుగా దక్షిణ యూరప్‌లోని స్లొవేనియాలో బయటపడ్డ బండి చక్రాలను తీసుకోవచ్చు. వాటి వయసు దాదాపు 5100 సంవత్సరాలని అంచనా. మన్నికకు పటిష్టమైనవే కావచ్చుగానీ, తూకం విషయంలోనే ఇవి మరో సమస్యను మోసుకొచ్చాయి. దాంతో, ఎక్కువ కాలం మన్నికయ్యేవేగాక, వీలైనంత తేలిగ్గా ఉండే చక్రాలకోసం పాకులాట మొదలైంది. ఆ తరువాతి అంచెగా, ఇప్పుడు లారీలకూ, బస్సులకూ టైర్లు తగిలించుకునే డిస్కుకు ఐదుచోట్ల సమాన దూరంలో కోడిగుడ్డు ఆకారపు కంతలు చూస్తున్నామే, అదేపద్ధతిలో కంతలు చేసి, తూకం తగ్గించే ప్రయత్నం జరిగుండొచ్చు. దాని మూలంగా చక్రమంతా ఒకే ఘనపదార్థంగా ఉండవలసిన అవసరం లేదనే కిటుకు తెలిసుండొచ్చు. ఫలితంగా అనతికాలంలోనే ఆకుల చక్రం (స్పోక్డ్ వీల్) ఉనికిలోకి వచ్చుండాలి. ఈ తరహా చక్రానికి అతిపురాతనమైన ఆధారం సింధూ నాగరికతలో దొరికిన బొమ్మబండ్లకుండే మట్టిచక్రాలు. అదే ప్రదేశంలో దొరికిన ముద్రికల (సీల్స్) మీద ఆరు ఆకులుండే చక్రం చిత్రలిపిలో కనిపిస్తుంది. క్రీ.పూ. 2000 కాలంలో ఈజిప్టులో వాడింది ఇదే తరహా ఆరాకుల చక్రం కాగా, ఇంచుమించు అదే సమయంలో గ్రీకులు వాడింది నాలుగాకుల చక్రం. చక్రం సాక్షాత్కారంతో నాగరికత రూపురేఖల్లో కొత్త జిలుగు ప్రవేశించింది. కుండలు చేసేందుకు సారె, నూలు వడికేందుకు రాట్నం వంటి పరికరాలు ఒకటొకటిగా జీవితానికి తోడుపడటం మొదలెట్టాయి. అంతదాకా కోతజంతువుగా మాత్రమే భావించబడిన పోతు జంతువుల హోదా హఠాత్తుగా మారి, ‘కాడిజంతువు’ ఉపయోగపడింది. ఎద్దులూ గాడిదల వంటి మందకొడి జంతువులు మాత్రమే. గుర్రం అప్పటికే పెంపుడు జంతువుల జాబితాలో చేరిపోయినా, దాని వేగానికి తట్టుకోగల బండిగానీ, సహకరించే రహదారులు గానీ ఇంకా రూపొందలేదు. గుర్రం వీపు మీద స్వారీ చేసే విధానం మొదట్లో లేదు. రథాలకు గుర్రాలను పూన్చడం మొదలైన చాలాకాలం తరువాత స్వారీ చేసే సాము అలవడింది. అందువల్లే, ఋగ్వేదంలో చెప్పిన ప్రయాణాలన్నీ రథాలమీదివి కాగా, గుర్రం మీద కూర్చున్నట్టు చెప్పే సందర్భాలు రెండు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మహాభారతంలో గూడా గుర్రం మీది ప్రయాణం కనిపించేది రెండే రెండు చోట్ల. కురుక్షేత్ర యుద్ధం చివరిరోజున, రథం విరిగిపోగా కిందికి దిగిన దుర్యోధనుడు గుర్రమెక్కి యుద్ధ రంగం నుండి తప్పుకోవడం మొదటి సందర్భం. అనుశాసనికపర్వంలోని ఒక ఉపాఖ్యానంలో ‘భంగాశ్వనుడు’ అనే రాజు గుర్రం మీద వేటకు వెళ్లడం రెండో సందర్భం. వీటిని బట్టి, గుర్రం చాలా కాలం దాకా కోత జంతువుగానే ఉండిపోయిందని అర్థమౌతుంది మనకు. ఎట్టకేలకు, క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం మధ్యలో, ‘ఇండో ఇరానియన్’దిగా చెప్పబడే సంస్కృతికి మూలపురుషులైన ‘ఆండ్రొనోవో’ తెగల నైపుణ్యంతో గుర్రాలు పూన్చేందుకు అనువైన రథాలు పురాతన ప్రపంచమంతా విస్తరించాయి. కాస్పియన్ సముద్రానికి తూర్పు తీరం మొదలు సైబీరియా దాకా విస్తరించిన ఈ ఆండ్రొనోవో తెగలు ప్రవేశపెట్టిన రెండు చక్రాల రథం అప్పట్లో అత్యాధునిక యుద్ధ శకటం. దానికి తొడిగిన చక్రానికుండే ఆకులు ఎనిమిది. ఒక వైపు చక్రాన్ని ఆధునీకరించటానికి ప్రయాసలు పడుతూనే, మానవుడు మరోవైపు ‘లోహం’ మీద అధికారం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగించాడు. లోహం మానవునికి కొత్తగా పరిచయమైన పదార్థం కాదు. ఆరుబయట ఎడతెరిపి లేకుండా మండే నానా రకాల శాఖల వేడికి పరిసరాల్లోని ఖనిజాలు కరిగి, నిప్పు చల్లారిన తావుల్లో తిరిగి గట్టిపడటం అతడు చాలాకాలంగా చూస్తున్నాడు. అది కేవలమొక వింతగా గమనించిన రోజులు గతించి, ‘ఎప్పుడు, ఎందుకు, ఎలా’ అనే ప్రశ్నలతో ఆలోచించడం మొదలెట్టిన తరువాత దాని ప్రయోజనం అతని చేతికి చిక్కింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
కులాసాగా కారాగారంలో..
ఇదో హోటల్. స్లొవేనియాలోని లబ్లియానాలో ఉంది. అయితే.. కొన్నేళ్ల క్రితం ఇదో జైలు. 130 ఏళ్ల పురాతనమైన ఈ కారాగారాన్ని అప్పట్లో హంగేరియన్ సైన్యం మిలటరీ జైలు కింద వాడేది. అయితే.. దీన్నిప్పుడు ఎంత స్టైలిష్ హోటల్‌లా మార్చేసినా.. పడుకోవాలంటే మాత్రం కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. ఎందుకంటే.. పడక గదులను సెల్‌లలోనే ఏర్పాటు చేశారు. హోటల్ సెలికాలో ఒక రోజు బస చేయాలంటే రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది.