న్యూఢిల్లీ: స్లొవేనియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో హైదరాబాద్ కుర్రాడు ఫిడేల్ రఫిక్ స్నేహిత్ భారత జట్టును గెలిపించాడు. భారత్ ‘ఎ’ జట్టుతో జరిగిన జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్ ఫైనల్లో అతను కీలక విజయాలతో తన టీమ్‌కు బంగారు పతకం అం దించాడు. క్యాడెట్ బాలికల కేటగిరీలో భారత జట్టు రజతం గెలిచింది. బాలుర ఫైనల్లో స్నేహిత్, పార్థ్ విర్మాని, అనుక్రమ్ జైన్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 3–2తో జీత్ చంద్ర, మానవ్ ఠక్కర్, మనుశ్ షా ఉన్న ‘ఎ’ జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ 3–2 (11–6, 7–11, 11–6, 2–11, 11–8)తో తన కన్నా మెరుగైన ర్యాంకర్ జీత్ చంద్రను కంగుతినిపించాడు.
తర్వాత జరిగిన పోటీల్లో పార్థ్ 0–3 (6–11, 4–11, 9–11)తో మానవ్ ఠక్కర్ చేతిలో, అనుక్రమ్ 1–3 (11–7, 6–11, 9–11, 10–12)తో మనుశ్ షా చేతిలో పరాజయం చవిచూశారు. 1–2తో వెనుకబడిన దశలో రివర్స్ సింగిల్స్‌లో మళ్లీ స్నేహిత్ 3–2 (11–9, 8–11, 4–11, 11–8, 11–5)తో మానవ్ ఠక్కర్‌పై గెలిచాడు. నిర్ణాయక మ్యాచ్‌లో పార్థ్ 3–2 (5–11, 11–6, 11–8, 8–11, 11–6)తో జీత్ చంద్రపై గెలవడంతో విజయం ఖాయమైంది. దీంతో ‘ఎ’ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. క్యాడెట్ బాలికల ఫైనల్లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది.